Yash Dayal IPL 2024:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ సీజన్ సెకండ్ హాఫ్‌లో అసాధారణ ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో నెగ్గి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అయితే పేసర్ యశ్ దయాల్ బెంగళురు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో చెన్నైని 17 పరుగులలోపే కట్టడి చేసి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఈ విషయంలో అతడికి కాస్త అదృష్టం కూడా తోడైంది. అదెలాగంటే?
అయితే మ్యాచ్‌కు ముందు చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురిసింది. దానివల్ల మైదానంలో తేమ ఎక్కువైంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతిపై గ్రిప్ దొరకక బౌలర్ చేతుల్లోంచి జారిపోతుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఫీల్డ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. బంతిని మార్చవలసిందిగా కోరాడు. అయితే అంపైర్లు దానికి నిరాకరించారు. బంతి మార్చే ఛాన్స్ లేదని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అదే బంతితో యశ్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది.
5 బంతుల్లో 11 పరుగులు కట్టడి
ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వలంటే చెన్నైకి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కావాలి. క్రీజులో ఫినిషర్ కింగ్ ధోనీ, నాన్ స్ట్రైక్ ఎండ్‌లో రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ సమయంలో డూప్లెసిస్ యశ్ దయాల్‌కు బంతినిచ్చాడు. 'దయాల్, ధోనీని ఆపగలడా?' అని అందరిలో సందేహం మొదలైంది. అనుకున్నట్లే తొలి బంతిని ధోనీ సిక్స్‌గా మలిచాడు. ఒక్కసారిగా సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.
ఇక సీఎస్కే శిబిరంలో గెలుస్తామన్న ధీమా కనిపించింది. కానీ, ధోనీ బాదిన ఆ సిక్స్ ఏకంగా 110 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో బంతి స్టేడియం బయట పడింది. అంతే అంపైర్లు ఇంకో బంతిని తెప్పించాల్సి వచ్చింది. ఇక కొత్త బంతితో దయాల్‌కు గ్రిప్ దొరికింది. అంతే రెండో బంతికే ధోనీని ఔట్ చేసి ఆర్సీబీకి దయాల్ బ్రేక్ ఇచ్చాడు. ఈ తర్వాత కూడా దయాల్ పర్ఫెక్ట్ స్లోబాల్స్ వేశాడు. చివరి నాలుగు బంతుల్లో కేవలం 1 పరుగే ఇచ్చాడు.