PCB On Champions Trophy :2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌లో జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి స్పష్టం చేశారు. భారత్‌కు ఏవైనా సమస్యలు ఉంటే, నేరుగా పీసీబీతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అంశంపై లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం ముందు నఖ్వీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు.
'పాకిస్థాన్ గర్వం, గౌరవమే మాకు ప్రాధాన్యం. ఛాంపియన్స్ ట్రోఫీ మా దేశంలోనే జరుగుతుంది. మేము హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించం. భారత్‌కు ఏవైనా సమస్యలు ఉంటే, వారు మా వద్దకు రావచ్చు. మేము వాటిని పరిష్కరిస్తాం. మేము హైబ్రిడ్ మోడల్‌కు వెళ్లకూడదనే వైఖరిపై గట్టిగా నిలబడతాం. వీలైనంత త్వరగా ఐసీసీ షెడ్యూల్ ప్రకటించడానికి మేము వేచి చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ బోర్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐసీసీ దాని విశ్వసనీయతను కాపాడుకోవాలి. షెడ్యూల్ రీషెడ్యూల్ అయ్యింది. కానీ మాకు ఎటువంటి క్యాన్సిల్ నోటీసు రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ప్రపంచంలోని ప్రతీ జట్లు సిద్ధంగా ఉన్నాయి. వచ్చి పాల్గొనేందుకు వాళ్లకు ఎలాంటి సమస్య లేదు.
క్రీడలు, రాజకీయాలు ఒకదానితో మరొకటి జోక్యం చేసుకోకూడదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నాను. పాకిస్థాన్ వైఖరిని ఎవ్వరూ సవాలు చేయలేరని భావిస్తున్నాను. ప్రతి ఐసీసీ మెంబర్‌కి సమాన హక్కులు ఉన్నాయి. ఇలాంటి అంశాల్లో అన్యాయంగా పని చేయకూడదు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు.