Jay Shah Resign ACC:బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే ఐసీసీ (International Cricket Council) ఛైర్మన్ పదవికి జై షా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జై షా ఏసీసీ పదవిని వదులుకోనున్నారట. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్కలే ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2020 నవంబర్‌లో ఈ బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైతే, ఈ ప్రతిష్ఠాత్మక పదవి చేపట్టిన మూడో భారతీయుడిగా జై షా రికార్డులకెక్కుతారు. ఇదివరకు భారత్ నుంచి ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్లుగా వ్యవహరించారు.
అయితే జనవరి 30, 31 రెండు రోజులపాటు ఇండోనేసియా బాలిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Annual General Meetings) సమావేశం ఉంది. ఈ సమావేశానికి జై షా సహా బోర్డు మెంబర్లు, హాజరై బ్రాడ్‌కాస్టింగ్ హక్కు (Broadcasting Rights)ల గురించి చర్చించనున్నారు. ఇక ఈ మీటింగ్‌లోనే జై షా పదవి వ్యవహారంపై కూడా ఓ క్లారిటీ రానుంది. కాగా, ఈ మీటింగ్‌లో 2025 ఆసియాకప్ వేదికపై కూడా ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.