IPL 2024 Gujarat Titans :ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు కప్పును కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులంతా ఐపీఎల్ కోసమే ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్‌కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరగబోయే మ్యాచ్‌తో 2024 సీజన్ ఆరంభం కానుంది. అయితే ఈ మెగాలీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుజరాత్ టైటాన్స్ ఖ్యాతిని ఆర్జించింది. 2022లో అరంగేట్రం చేసిన ఈ జట్టు తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. అంతేనా 2023లో జరిగిన రెండో సీజన్లోనూ ఫైనల్‌కు చేరి శెభాష్ అనిపించింది. ఇప్పుడు మరోసారి కప్పును దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గత సీజన్ వరకూ స్ఫూర్తిమంతమైన నాయకత్వంతో జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌కు ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా మారాడు. అయినా స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న గుజరాత్ కప్పు తమదే అని ఢంకా బజాయించి మరీ చెప్తోంది.
అతడు లేకపోయినా బలంగానే : హార్దిక్ పోయినా హార్దిక్ పాండ్యా గుజరాత్‌ను వీడి ముంబయి ఇండియన్స్‌కు వెళ్లిపోయినా మహ్మద్ షమీ గాయంతో జట్టుకు దూరమైనా గుజరాత్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటిదాకా సారథిగా అనుభవం లేని యువ బ్యాటర్, స్టార్ ఓపెనర్ శుభమ్‌న్ గిల్ సారథ్యంలో గుజరాత్ ఈ సీజన్‌లో బరిలోగి దిగనుంది. శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియాలతో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. గత ఏడాది ఐపీఎల్‌లో 890 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన గిల్ మరోసారి బ్యాట్ ఝుళిపిస్తే గుజరాత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. న్యూజిలాండ్‌ను ఎన్నోసార్లు క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్న కేన్ విలియమ్సన్ మిడిలార్డర్‌లో ఉండడం గుజరాత్‌కు కలిసిరానుంది. సమయోచితంగా బ్యాటింగ్ చేయగల నేర్పు ఉన్న విలియమ్సన్ ఇటీవల భీకర ఫామ్‌లో ఉండడం గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇచ్చింది. యువ బ్యాటర్ సాయిసుదర్శన్ కూడా ఇప్పటికే తన ప్రతిభను చాటుకుని మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మిల్లర్, వేడ్‌లు విధ్వంసం సాగిస్తే గుజరాత్‌కు ఇక ఎదురుండదు.
అందులోనే సమస్యలు :హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ దూరం కావడం గుజరాత్ బౌలింగ్‌ను కాస్త ఆందోళన పరుస్తోంది. గత ఐపీఎల్‌లో షమీ 28 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గుజరాత్ జట్టులో లిటల్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఉన్నా వాళ్లు ఎప్పుడు భారీగా పరుగులిస్తారో తెలియదు. రషీద్ ఖాన్ రూపంలో సూపర్ స్పిన్నర్ టైటాన్స్‌కు ఉన్నాడు. కానీ ఇటీవలే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన అతడు వెంటనే పూర్తి స్థాయి ప్రదర్శన చేయగలడా అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి లేని జట్టును నూతన సారథి శుభ్‌మన్ గిల్ ఎలా నడిపిస్తాడో వేచి చూడాలి.