T20 World Cup Final Match India Celebrations : విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించడం వల్ల దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సంతోషం వ్యక్తంచేశారు. బాణసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడం వల్ల జమ్ముకశ్మీర్‌లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తంచేశారు. ముంబయి విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంతాకాదు. ఆనందం పట్టలేక అనేకమంది నృత్యాలు చేశారు. ముంబయి మెరైన్ డ్రైవ్, నాగ్‌పుర్ సహా పలుచోట్ల అభిమానులు హర్షధ్వానాలు వ్యక్తంచేశారు.
అభిమానులతో కలిసి బీజేపీ నేత సంబరాలు
బెంగళూరులో పలు వీధులన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. కోల్‌కతాలో టీ20 ప్రపంచకప్ నమూనాతో యువత సందడి చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. కేరళలోని ఎర్నాకులంలో టీమ్ఇండియా అభిమానులు వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టారు. డ్యాన్స్ చేస్తూ తమ అభిమానాన్నిచాటుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దిల్లీలోని ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో క్రికెట్ అభిమానులతో కలిసి బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఊపుతూ భారత్ విజయంపై సంతోషం వ్యక్తంచేశారు.