Washington Sundar Gambhir Plan : న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమ్ ఇండియాకు పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. బెంగళూరు పిచ్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. వర్షం కారణంగా పిచ్ మొదట పేస్‌కు అనుకూలంగా మారింది. కానీ, దానిని టీమ్ ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకోలేదు. బ్యాటింగ్ ఎంచుకుని తడబాటుకు గురైంది. ఫలితంగా ఓటమిని అందుకుంది.
దీంతో ఇప్పుడు భారత జట్టు మిగతా రెండు టెస్టుల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జట్టులోకి అదనంగా స్పిన్ ఆల్ రౌండర్‌ను తెచ్చుకుంది. అదీ కూడా దాదాపు మూడేళ్ల క్రితం చివరి సారిగా టెస్టు ఆడిన వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంది.
రెండు కారణాలు - మొదటి మ్యాచ్‌కు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను తీసుకుంది బీసీసీఐ. కానీ ఆఖరి రెండు టెస్టులకు మాత్రం 16 మందిని సెలెక్ట్ చేసింది. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. అందులో ఒకటి ఇద్దరు బ్యాటర్లకు గాయాలు ఆందోళన పెడుతుండటం. మరొకటి గౌతమ్ గంభీర్ ప్లాన్ కోసం 16 మందిని తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
సుందర్ స్పెషల్ స్పిన్నర్ - ప్రస్తుతం ఉన్న జట్టులో ఇప్పటికే నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అందులో ముగ్గురు బ్యాటింగ్ చేయగలిగే ఆల్‌రౌండర్లు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్లు, కుల్‌దీప్ యాదవ్ మాత్రం స్పెషలిస్ట్ స్పిన్నర్. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరొక స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేరిపోయాడు. పైగా జడేజా, అక్షర్ ఎడమచేతివాటం కలిగిన బౌలర్ కమ్ బ్యాటర్లు. కానీ, సుందర్ మాత్రం ఎడమచేతివాటం బ్యాటర్, కుడిచేతి బౌలర్. ఫింగర్ స్పిన్ వేయగల సమర్థుడు కూడా. మునివేళ్లతోనే బంతిని సంధించగలడు.
గంభీర్ ప్లాన్ ఇదే - వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు కేవలం 4 టెస్టుల్లో మాత్రమే బరిలోకి దిగాడు. గబ్బా మైదానం వేదికగా ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడిన అతడు ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పేస్‌కు అనుకూలంగా ఉండే ఆ పిచ్‌పై బంతులను చక్కగా సంధించాడు. తాజాగా రంజీ ట్రోఫీలో వన్‌డౌన్‌లోనూ బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్, భారీ సెంచరీ సాధించాడు. ఇది అతడికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అందుకే గంభీర్ మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి సుందర్‌ను జట్టులోకి తీసుకున్నాడట. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు తెలిపాయి. నెక్ట్స్ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.