ICC Champions Trophy Pakistan : ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనుంది. పాకిస్థాన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఒకవేళ భారత్ పాకిస్థాన్‌కు వెళ్తే అక్కడ తలెత్తే భద్రతా సమస్యలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత్. పాక్‌కు వెళ్తే తలెత్తే సమస్యలు, అలాగే తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ఓసారి పరిశీలిద్దాం.
భద్రతా చర్యలు : భారత జట్టు పాక్‌కు వెళ్తే భద్రతా ఖర్చు భారీగా ఉండనుంది. పాకిస్థాన్ నుంచి అలాగే, భారత్ నుంచి భారీగా భద్రతా దళాలను మోహరించాల్సి ఉంటుంది. పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించాల్సి ఉంటుంది.
నిఘా : డ్రోన్‌లు, సీసీ టీవీ కెమెరాలను భారీగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇతర పర్యవేక్షణ వ్యవస్థలతో పాటు మెరుగైన నిఘా సాంకేతికతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారత జట్టు చుట్టూ వారు ప్రయాణించే మార్గాల్లో ఉండే హోటళ్లలో కనివినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
రవాణా : భారత జట్టు ప్రయాణించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణానికి ప్రత్యేక విమానంతో సహా జట్టుకు సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని పాకిస్థానే కల్పించాల్సి ఉంటుంది.
మౌలిక సదుపాయాలు : భారత జట్టు మ్యాచ్‌లు ఆడే మైదానాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫోర్టిఫైడ్ ఎంట్రీ పాయింట్లు, బాంబు డిటెక్షన్ సిస్టమ్‌లు ఉండి తీరాల్సిందే. స్టేడియాల లోపల భద్రతా సిబ్బందిని గణనీయంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.