తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పైడితల్లి సిరిమాను సంబరాలకు సర్వం సిద్ధం- జాతర విశిష్టతతోపాటు షెడ్యూల్​ మీకోసం!

పైడితల్లి సిరిమాను సంబరాలకు సర్వం సిద్ధం- అక్టోబర్​ 15న సిరిమానోత్సవం- ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగింపు

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Sirimanu Utsavam
Sirimanu Utsavam (ETV Bharat)

Vizianagaram Pydithalli Ammavaru Sirimanu Utsavam :ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పైడితల్లి సిరిమాను సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

సిరిమాను షెడ్యూల్ ఇదిగో!
ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీలు ఖరారయ్యాయి. ఆలయ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ ఏడాది అక్టోబర్ 15న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగనుంది. అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవంతో మొదలయ్యే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తాయి.

సిరిమానోత్సవం జాతర విశిష్టత
సాధారణంగా దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని ఏళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అందుకే ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ మంగళవారం రోజు నుంచి సిరిమాను జాతర జరుగనుంది.

జాతరలో కీలకమైన సిరిమాను చెట్టు
సిరిమాను జాతరలో అత్యంత కీలకమైనది సిరిమాను చెట్టు. సిరిమానోత్సవానికి కనీసం నెల రోజుల ముందే సిరిమాను చెట్టు ఎక్కుడుందనే విషయమై అమ్మవారు ఆలయ పూజారికి తెలియజేస్తారంట! అమ్మవారి ఆదేశం మేరకు పూజారి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ చెట్టును సేకరిస్తారు. ఆ తర్వాత వడ్రంగులు ఈ చింత చెట్టును సిరిమానుగా తయారుచేస్తారు. ఈ సిరిమానుపై కూర్చుని పూజారి ప్రజలను, రాజ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మరోవైపు సిరిమానోత్సవంలో రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. సిరిమానును తయారుచేసే సమయంలోనే ఈ రథాలను కూడా తయారుచేస్తారు.

తోలేళ్ల ఉత్సవం అంటే ఏంటి?
పైడితల్లి సిరిమాను ఉత్సవానికి ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 14 వ తేదీ తోలేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన తోలేళ్ల ఉత్సవం ముఖ్యంగా రైతులకు చెందిన ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా ఈ రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను విజయనగరం కోటలోకి తీసుకెళ్తారు. అక్కడ కోటకు పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందిన విత్తనాలను బస్తాలలో ఉంచుతారు. అనంతరం పూజారి చేతుల మీదుగా రైతులు ఆ విత్తనాలను అందుకొని తమ పొలంలో చల్లే విత్తనాల బస్తాలలో వాటిని కలుపుతారు.

తోలేళ్ల ఉత్సవం పేరు ఇందుకే!
అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను పొలంలో నాగలితో తొలుత దున్నాలి. ఈ నాగలిని ఉత్తరాదిలో 'ఏరు' అని కూడా అంటారు. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను తొలుత దున్నే ఉత్సవాన్ని 'తొలి' 'ఏరు' అని అనే వారు అదే కాలక్రమేణా తోలేళ్ల ఉత్సవంగా మారింది. ఈ ఉత్సవంలో అందించిన విత్తనాలతో సాగు చేస్తే చీడ పీడల భయం లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా రైతులు అధిక ఫలసాయం అందుకుంటారని విశ్వాసం.

ఘట సమర్పణ
తోలేళ్ల ఉత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు, ఘటాలు, కానుకలు సమర్పించుకుంటారు. ఈ సందర్భంగా చదురుగుడి ప్రాంతమంతా భక్త జన సందోహంతో నిండిపోతుంది. మరుసటి రోజు జరుగనున్న సిరిమాను ఉత్సవం కోసం సర్వం సిద్ధమవుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవంలో పాల్గొనడం పూర్వ జన్మ పుణ్యంగా భావిస్తారు. తనను ఆశ్రయించే భక్తులను సదా కాపాడే పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీమాత్రే నమః

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details