Tiruttani Subramanya Swamy Temple :తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది.
మురుగ పెరుమాళ్లు ఆలయ విశేషాలు
తిరుత్తణి దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని 'బియ్యపుకొండ' అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని 'గానుగ పిండి కొండ' అని కూడా పిలుస్తారు.
తప్పులను క్షమించి ఓదార్చే మురుగన్
తిరుత్తణి క్షేత్రం స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతలు, మునులను బాధిస్తున్న శూరపద్మునితో యుద్ధం చేసాడంట! వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయ కుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తోంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి 'తణిగై' లేదా 'శాంతిపురి' అనే పేరొచ్చింది. అలాగే 'తణిగ' అంటే ద్రవిడ భాషలో క్షమించడం, లేదా ఓదార్చడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
మెట్లు ఎక్కితే చాలు 365 రోజులు పూజించినట్లే!
తిరుత్తణి క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు, కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేయడం వల్ల సంవత్సరమంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు.
కుమారునికి జ్ఞానశక్తిని ప్రసాదించిన శివుడు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్టించి శివుని సేవించాడంట. అప్పుడు కుమారస్వామి పితృ భక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి 'జ్ఞానశక్తి' అనే 'ఈటె'ను అనుగ్రహించాడట. అప్పటి నుంచి ఈ స్వామికి "జ్ఞానశక్తి ధరుడు" అనే పేరొచ్చిందని శాస్త్ర వచనం.
తిరుత్తణి క్షేత్ర విశేషం - కుమార తీర్థం
తిరుత్తణిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. అంతేకాదు కుమారస్వామి, శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.
శ్రీరామునికి మనశ్శాంతి ప్రసాదించిన క్షేత్రం
త్రేతా యుగంలో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని సేవించి, అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు, ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్ర వచనం. ద్వాపర యుగములో, పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ తిరుత్తణికి వచ్చి ఇక్కడ స్వామి వారిని కొలిచాడంట.
పోగొట్టుకున్నవి తిరిగి పొందాలంటే తప్పకుండా దర్శించాల్సిందే!
తిరుత్తణి దర్శించి పోగొట్టుకున్నవి పొందిన బ్రహ్మ, విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహా విష్ణువు తిరుత్తణి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంఖు, చక్రాలు తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. మరో ముఖ్య విశేషమేమిటంటే ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ, ప్రణవ అర్థమును చెప్పలేక పోవడం వలన, ఆయనను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యములను పొందాడు కాబట్టి తిరుత్తణి క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం.
అలాగే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే, ఇంద్ర తీర్థములో, "కరున్ కువలై" అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో సుబ్రహ్మణ్యుని పూజించిన తరువాతనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న" సంఘనీతి, పద్మనీతి, చింతామణి " మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడని ప్రతీతి. అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునే వారు, చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి.