తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

భోగభాగ్యాల భోగి పండుగ- ఆ పేరెలా వచ్చింది? భోగి మంటలతో కలిగే ప్రయోజనాలెన్నో! - BHOGI FESTIVAL 2025

భోగి పండుగకు ఆ పేరెలా వచ్చింది? భోగి మంటలు వేయడం వల్ల ప్రయోజనాలు మీ కోసం!

Bhogi Festival Significance
Bhogi Festival Significance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 6:11 PM IST

Updated : Jan 12, 2025, 9:18 PM IST

Bhogi Festival Significance :తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. నాలుగు రోజుల పండుగగా జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి. అసలు భోగి పండుగకు ఆ పేరెలా వచ్చింది? భోగి పండుగ ఎలా జరుపుకోవాలి? భోగి మంటలు వేయడం వలన ప్రయోజనాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బోగి పండుగ ఇందుకే!
హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు.

భోగి మంటల వెనుక అంతరార్ధం ఇదే
గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణయానంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు.

భోగి ఎందుకు జరుపుకుంటారంటే!
'భుగ్' అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. 'భోగం' అంటే సుఖం. పురాణాల ప్రకారం, శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. దానికి సంకేతంగానే భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పెద్దలు చెబుతారు.

సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు
మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు భోగి రోజు అని అందుకే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి పండుగగా జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని తెలుస్తోంది.

భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు
భోగి మంటలు కేవలం చలి నుంచి కాపాడటం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అదెలాగంటే సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ పొగను పీల్చడం వలన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పెంచుకోవడం కాదు పంచుకోవడమే ప్రధానం
సిరిసంపదలను పెంచుకోవడం కాదు నలుగురితో కలిసి పంచుకోడానికి అనే సందేశం భోగి మనందరికీ ఇస్తుంది. అందుకే ఈ నాటికీ పల్లెల్లో ఈ పండుగ సందర్భంగా ఒకరింట్లో పండిన పంటలను, వండిన పిండి వంటలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేసేదే భోగి పండుగ. భోగి పండుగ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. రానున్న భోగి పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Last Updated : Jan 12, 2025, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details