Masa Shivaratri :అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లోపించడం, కుటుంబ శాంతి లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడటానికి కారణం గ్రహ సంచారం ప్రతికూలంగా ఉండడమే! సానుకూల ఫలితాల కోసం మాస శివరాత్రి పూజ తప్పకుండా చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా మాస శివరాత్రి ఎప్పుడు? ఆ రోజు ఎవరిని పూజించాలి? ఎలా పూజించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మాస శివరాత్రి విశిష్టత
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాస శివరాత్రి రోజున శివుని పూజిస్తే గ్రహ దోషాలు పోతాయని, కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం, భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా అసలు మాస శివరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం.
మాస శివరాత్రి ఎప్పుడొస్తుంది?
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి నెలా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాం. అయితే మాస శివరాత్రి జరుపుకునే రోజు రాత్రి సమయంలో చతుర్దశి తిథి తప్పకుండా ఉండాలి.
మాస శివరాత్రి ఎప్పుడు?
మార్గశిర బహుళ చతుర్దశి డిసెంబర్ 29వ తేదీ ఆదివారం తెల్లవారు ఝాము 3:39 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 30వ తేదీ సోమవారం తెల్లవారు ఝాము 04:02 గంటలకు ముగుస్తుంది. మాస శివరాత్రి జరుపుకోవాలంటే రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉండాలి. కాబట్టి మార్గశిర మాస శివ రాత్రిని డిసెంబర్ 29 ఆదివారం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.
మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
పరమశివుడు లయ కారకుడు. అంటే సృష్టిని అంతం చేసేవాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే, జాతకంలో చంద్ర బలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యు కారకుడు కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో వారి ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మాస శివరాత్రి రోజు శివుని ఆరాధిస్తే కేతు గండాలు తొలగిపోతాయని విశ్వాసం.