Rishi Panchami Puja Vidhi In Telugu :ఋషి పంచమి వ్రతాన్ని మహిళలు తమ నెలసరి సమయంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా చేసుకుంటారు. ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. ఋషి పంచమి రోజున ఎవరిని పూజించాలి? ఎలా పూజించాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఋషి పంచమి రోజు "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో సప్తర్షులు ఖ్యాతికెక్కారు.
అత్రి మహర్షి
సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమయంలో అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకు తన ఆశీర్వాదాన్ని ఇచ్చారు.
భారద్వజ మహర్షి
శ్రీరాముని అరణ్యవాస సమయంలో సీతారాములకు చిత్రకూట పర్వతానికి దారి చూపించినవాడు భారధ్వజ మహర్షి.
గౌతమ మహర్షి
తన భార్య అహల్యకు శాపవిమోచనం కలిగించిన శ్రీరామునికి తన తపః శక్తిని మొత్తం ధారబోసిన వాడు గౌతమ మహర్షి.
విశ్వామిత్రుడు
రామలక్ష్మణులను తన వెంట తోడ్కొనిబోయి వారిచేత రాక్షస సంహారం చేయించినవాడు విశ్వామిత్రుడు
వశిష్ఠుడు
ఇక్ష్వాకు వంశ కులగురువు, శ్రీరాముని గురువు వశిష్ఠుడు.
జమదగ్ని
శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారమైన పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి.
కశ్యపుడు
శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మరొక అవతారమైన వామనుడి తండ్రి కశ్యప మహర్షి.
ఈ సప్తర్షులను ఋషి పంచమి రోజున తప్పకుండా స్మరించాలి, పూజించాలి. ఎందుకంటే వారు అందించిన జ్ఞానమే నేటి భారతదేశాన్ని గొప్పగా నిలబెడుతోంది. ఈ సప్తర్షులకు రామాయణానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఋషి పంచమి రోజు శ్రీరాముని పూజించడం, రామాయణ పారాయణ చేయడం తప్పకుండా చేయాలి.
ఋషి పంచమి పూజా విధానం
ఋషి పంచమి రోజున వేకువజామునే నిద్ర లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శ్రీరామ పరివార చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ముందుగా దీపారాధన చేసుకొని ఆచమనం చేసి గణపతి పూజ చేయాలి. అనంతరం కలశపూజ చేయాలి. మల్లెలు, జాజులు, మందారాలు వంటి రకరకాల పూలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. వడపప్పు, పానకం, చిత్రాన్నం పళ్ళు, కొబ్బరి కాయలు శ్రీరాముల వారికి నివేదించాలి. అనంతరం మంగళ హారతులు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. పిదప ఋషి పంచమి వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. ఈ వ్రతము ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపనం ఇలా చేయాలి!
ఉద్యాపనం చేసే రోజు ఒక సద్బ్రాహ్మణుడిని గురువుగా ఎంచుకొని ఇంటికి ఆహ్వానించి సకల విధివిధానాలతో పూజించాలి. షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి. తరువాత వెండి కానీ రాగి కానీ కలశం చెంబుకు ఒక నూతన వస్త్రాన్ని కట్టి పంచరత్నములు, పూలు, పండ్లు, గంధం, అక్షతలతో ఆ కలశమును పూజించాలి. తమ శక్తి కొలది వెండితో కానీ రాగితో కానీ సప్తర్షుల విగ్రహాలను తయారు చేయించి ఆ కలశముల మీద ఉంచి, ఫల పుష్పములతో సమస్త పూజా ద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో సప్త ఋషులను పూజించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అక్కడితో ఋషి పంచమి నోము పూర్తి అవుతుంది.
ఋషి పంచమి వ్రత ఫలం
ఏ స్త్రీ ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరిస్తుందో ఆమె సమస్త పాపముల నుంచి విముక్తి పొంది ఇహ లోకమున పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉండి చివరకు మోక్షము పొందును. రానున్న ఋషి పంచమి రోజు సప్తర్షులను స్మరించుకొని శాస్త్రోకంగా పూజ చేసుకొని సకల దోషాలను తొలగించుకుందాం. జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.