Nagula Chavithi 2024 Date and Pooja Vidhanam: కార్తిక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. హిందూ సంప్రదాయంలో నాగ పంచమి, నాగుల చవితి వేడుకలు ప్రత్యేకం. నాగుల చవితిని కార్తికమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజున జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం నాగులచవితి ఏ రోజు వచ్చింది..? పూజా విధానం ఏంటి..? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నాగులచవితి ఎప్పుడు:నాగుల చవితినికార్తిక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి తిథి రోజున జరుపుకుంటామని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ ఏడాది చవితి ఘడియలు నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యి మరునాడు అంటే నవంబర్ 5వ తేదీ రాత్రి 8.56 గంటల వరకు ఉంది. నాగుల చవితిని శాస్త్ర ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని.. నవంబర్ 5వ తేదీన సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు చవితి తిథి ఉంది. కాబట్టి నవంబర్ 5వ తేదీ మంగళవారం రోజు నాగుల చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు.
పుట్టలో పాలుపోసే ముహూర్తం:నవంబర్ 5వ తేదీన మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8.20 గంటల మధ్యలో పుట్టలో పాలు పోయవచ్చని చెబుతున్నారు. అలాగే ఉదయం 9.10 గంటల నుంచి మధ్యాహ్నం 12.40 గంటలలోగా పుట్టలో పాలు పోయడానికి మంచి సమయమని సూచిస్తున్నారు.
నాగుల చవితి పూజా విధానం: కార్తిక మాసంలో జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్లి పూజ చేసినా లేదా పుట్ట దగ్గరకు వెళ్లి పూజ చేసినా సమస్త నాగ దేవతల అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. జంట నాగుల విగ్రహాలకు పూజ చేస్తే రాహుకేత దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయని అంటున్నారు.
జంట నాగుల పూజా విధానం:
- తెల్లవారు జూమున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి.
- ఆ తర్వాత జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం నిర్వహించాలి.
- ఆ తర్వాత శుభ్రంగా నీటితో విగ్రహాలు కడగాలి.
- అనంతరం పసుపు కలిపిన నీటితో, కుంకుమ కలిపిన నీటితో జంట నాగుల విగ్రహాలకు అభిషేకం నిర్వహించాలి.
- అనంతరం మరోసారి నీళ్లతో కడగాలి.
- ఆ తర్వాత ఆ విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
- పత్తిని తీసుకుని వస్త్రం లాగా చేసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ వస్త్రాన్ని జంట నాగుల విగ్రహాలకు అలకరించాలి.
- అనంతరం ఆ విగ్రహాల వద్ద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించాలి. తొమ్మిది వత్తులు ఎందుకంటే.. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధాత్రరాష్ట్ర, తక్షక, కాళీయ అని నాగ దేవతలు తొమ్మిది రకాలుగా ఉంటారు. ఆ తొమ్మిది నాగ దేవతలకు సంకేతంగా 9 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించాలి.
- జంట నాగుల విగ్రహాల తోకల దగ్గర సువాసన కలిగిన పూలను అలంకరించి అనంతరం జిల్లేడు ఆకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా పెట్టాలి.
- వీలైతే ఆ విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలని సూచిస్తున్నారు.