Magha Puranam Chapter 28 : పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 28వ అధ్యాయంలో సులక్షరాజు తన పుత్రుని ఏ విధంగా కలుసుకున్నాడో గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! ఓ వైపు బాలుడు అడవిలో శ్రీహరిని పూజిస్తూ కాలం గడుపుతుంటే, మరోవైపు సులక్షణుడు తన చిన్న భార్య కోసం తన పరివారాన్ని పంపించి అంతటా వెతికించినా ప్రయోజనం లేక, చేసేదేమి లేక మిన్నకుండెను.
తల్లి, తండ్రి శ్రీహరియే!
అరణ్యంలో బాలుడు మిక్కిలి జ్ఞానవంతుడై శ్రీహరిని తల్లి, తండ్రిగా, స్నేహితుడిగా, సంకలన బంధువులుగా భావించి, సదా భక్తితో ఆ పుండరీకాక్షుని సేవిస్తూ ఆ తులసి చెట్టునే శ్రీహరిగా భావించి పూజిస్తూ ఆరు మాసములు గడిపాడు. ఎంతకూ శ్రీహరి ప్రసన్నుడు కాకపోవడం వల్ల ఆ బాలుడు విచారంతో ఉండెను.
బాలునికి కర్తవ్యం బోధించిన ఆకాశవాణి
ఒకనాడు ఆకాశవాణి బాలునితో "ఓ రాజపుత్రా! నీకు సమీపంలో ఉన్న సరస్సులో మాఘమాసమున మకరరాశియందు సూర్యుడు ఉండగా ప్రాతఃకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజించిన శ్రీహరి ప్రసన్నుడు కాగలడు" అని పలికింది.
బాలునికి శ్రీహరి సాక్షాత్కారం
అశరీరవాణి మాటలు విన్న బాలుడు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో సరస్సులో స్నానం చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు. మాఘశుద్ధ చతుర్దశి రోజు ఆ శ్రీహరి బాలునికి ప్రత్యక్షమై తన పవిత్ర హస్తాలతో బాలుని స్పృశించి అతనిని ఆలింగనం చేసుకొని కరుణతో ఇట్లు పలికాడు.
శ్రీహరి వరం
బాలునితో శ్రీహరి "బాలకా! నీ భక్తికి మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోమనగా ఆ బాలుడు శ్రీహరితో "జగన్నాథా! నాకు శాశ్వతంగా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు" అనగా ఆ శ్రీహరి "బాలుడా! నీవు రాజపుత్రుడవు! నీవు ఈ భూమిని పరిపాలింపుము. మాఘమాస వ్రతమును ఆచరిస్తూ పుత్ర పౌత్రయుతుడవై సమస్త సంపదలతో, వివిధ భోగములతో సుఖముగా జీవించి అంత్యమున నా సన్నిధికి చేరి శాశ్వత కైవల్యమును పొందుతావు" అని వరమిచ్చాడు.