Kumbha Sankranti 2025 :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశుల ఉన్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించడాన్ని కుంభ సంక్రమణం అంటారు. ఈ సందర్భంగా కుంభ సంక్రమణం ఎప్పుడు జరుగనుంది? ఆ రోజు పాటించాల్సిన పరిహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుంభ సంక్రమణం ఎప్పుడు
సూర్యుడు మకరం నుంచి కుంభ రాశిలో ప్రవేశించే సమయంలో కుంభ సంక్రాంతి జరుపుకుంటారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 12:35 నిమిషాలకు సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం 12:35 నుంచి సూర్యాస్తమయం వరకు పుణ్యస్నానాలు చేయడానికి, దానధర్మాలు చేయడానికి శుభ సమయం.
కుంభ సంక్రమణం విశిష్టత
కుంభ సంక్రమణాన్ని కుంభ సంక్రాంతి అని కూడా అంటారు. పరమ పవిత్రమైన కుంభ సంక్రాంతి సమయంలో పుణ్య నదులలో స్నానం చేయడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం, జపం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల సూర్య భగవానుడు, శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం. అంతేకాదు ఈ రోజు సూర్యుని ధ్యానం చేసి, ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
కుంభ సంక్రాంతి రోజు ఆచరించాల్సిన విధివిధానాలు
కుంభ సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టం. ప్రస్తుతం విశేషించి కుంభ మేళా జరుగుతోంది కాబట్టి వీలున్న వారు ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో స్నానం చేయడం సర్వదా శ్రేష్టం. నదీస్నానం వీలుకాని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేయడం వలన నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.