Guru Pradosh Vrata Pooja Vidhi :హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రదోషం పరమ పవిత్రమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రదోష వ్రతం నెలకు రెండు సార్లు వస్తుంది. శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు ప్రదోషం వస్తుంది. ఏ రోజైతే సూర్యాస్తమయం తరువాత కనీసం 2.30 గంటల సమయం పాటు త్రయోదశి తిథి ఉంటుందో ఆ రోజు సాయంత్రం సమయాన్ని ప్రదోష సమయంగా చెబుతారు. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం ప్రదోష వ్రతం రోజు చేసే శివారాధనకు కోటి రెట్లు అధిక ఫలం ఉంటుందని తెలుస్తోంది.
గురు ప్రదోషం అంటే?
పక్ష ప్రదోషం వచ్చే వారాన్ని బట్టి ఆ ప్రదోషం పేరు మారుతుంది. ఈసారి ప్రదోషం గురువారం రావడం వలన దీనిని గురు ప్రదోషం అంటారు.
గురు ప్రదోష పూజా సమయం
గురువారం సాయంత్రం 3:30 నిమిషాల నుంచి త్రయోదశి రావడం వల్ల గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు గురు ప్రదోష పూజ చేసుకోవచ్చు.
గురు ప్రదోష విశిష్టత
శివపార్వతులకు అంకితమైన ప్రదోషం రోజు శివపార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ప్రదోష వ్రతం పరమశివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివ పార్వతులని పూజిస్తారు. ముఖ్యంగా ఈసారి గురువారం పక్ష ప్రదోషం రావడం వలన ఈ రోజు చేసే శివారాధనతో శివపార్వతుల అనుగ్రహంతో పాటు గురు గ్రహ అనుకూలత వలన ఆర్థిక లాభాలు, పదోన్నతులు, వివాహం కాని వారికి వివాహం కావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గురు ప్రదోష పూజ ఎలా చేయాలి?
పరమ పవిత్రమైన గురు ప్రదోషం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివపార్వతులను, కుల గురువులను పసుపు రంగు పూలతో పూజించాలి. పసుపు రంగు ప్రసాదాలను సమర్పించాలి. శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం, గురు శ్లోకాలను పఠించాలి. వీలైతే గురు చరిత్ర కూడా పారాయణం చేయవచ్చు.
శివాలయంలో పూజలు ఇలా!
సంధ్యాసమయంలో ప్రదోష వేళలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకాలు, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. నానబెట్టిన శనగలను భక్తితో శివునికి, గురువులకు నివేదించి వాటిని ఆలయంలో భక్తులకు పంచి పెట్టాలి. దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.
ఈ దానాలు శ్రేష్ఠం
గురు ప్రదోషం రోజు బ్రాహ్మణులకు, అన్నార్తులకు అన్నదానం చేయడం శ్రేష్టం. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపించడం వలన గురు గ్రహం అనుకూలతతో కార్యజయం, ఐశ్వర్యప్రాప్తి వంటి శుభ ఫలితాలను పొందవచ్చు. శక్తి ఉన్నవారు ఇతర దానాలు కూడా చేయవచ్చు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.