Woman Lost Life with Instagram Love : ఇద్దరు యువతులు ఒకరికి తెలియకుండా మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే అబ్బాయిని ప్రేమించారు. విషయం తెలుసుకున్నాక తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అతను ఒప్పుకోకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువతులు ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని బత్తలపల్లి మండలం గరిసినపల్లెకు చెందిన దివాకర్ డిగ్రీ పూర్తి చేసి అనంతపురంలో బైక్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇన్‌స్టాలో ముదిగుబ్బకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఈమెకు వేరొకరితో వివాహం చేశారు. అయితే ఈమె నెల రోజులు గడవకనే భర్తను వదిలేసి సొంతూరుకు చేరుకుంది. అప్పటి నుంచి దివాకర్‌ను కలుస్తుండేది.
చెల్లెలి ఫ్రెండ్‌తో పరిచయం: ఇదే క్రమంలో దివాకర్‌కు తన చెల్లెలి స్నేహితురాలైన కణేకల్లు మండలం యర్రగుంటకు చెందిన యువతి పరిచయమైంది. ఈమె ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ గుల్జార్‌పేటలోని ఓ వసతి గృహంలో ఉంటోంది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనతోపాటు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఈమె తెలుసుకుని దివాకర్‌ని నిలదీసింది. ఇలా ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవ సాగింది. ప్రియురాళ్లను ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని దివాకర్ భావించాడు. ఈ మేరకు యువతులిద్దరినీ ఓ వసతి గృహానికి తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం వరకూ ముగ్గురూ గదిలో కూర్చుని మాట్లాడుకున్నారు. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని యువతులు పట్టుబట్టారు.