తెలంగాణ

telangana

ETV Bharat / press-releases

అశోక్​నగర్‌లో మరోసారి గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన - భారీగా పోలీసుల మోహరింపు - ఏం జరగనుంది?

అశోక్‌ నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన - సీఎం తమను పిలిపించుకొని బాధ వినాలని డిమాండ్ - భారీగా మోహరించిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Group-1 Candidates Protest In Hyderabad
Group-1 Candidates Protest In Ashok Nagar (ETV Bharat)

Group-1 Candidates Protest In Ashok Nagar :అశోక్‌నగర్‌ చౌరస్తాలో గ్రూప్‌-1 అభ్యర్థులు మళ్లీ ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాల గొంతు కోస్తోందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్థులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీవో 29 వల్ల రిజర్వేషన్ పొందేవారు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందే అర్హత లేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌ చేసుకున్నంత మాత్రాన, తాము పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాదని స్పష్టం చేశారు. సీఎం తమను పిలిపించుకొని బాధ వినాలని విజ్ఞప్తి చేశారు.

గాంధీభవన్‌ ముట్టడికి పిలుపు : అశోక్‌నగర్‌ వద్ద గ్రూప్‌-1 అభ్యర్థుల ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. లాఠీఛార్జ్‌ వద్దని సీఎం చెప్పినా పోలీసులు వినడం లేదని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీభవన్‌ ముట్టడికి వారు పిలుపునివ్వడంతో అక్కడా భారీగా పోలీసులు మోహరించారు.

‘‘ప్రతిపక్షాలతో మాట్లాడే బదులు మాతో మాట్లాడండి. ఆర్థికంగా, మానసికంగా చితికిపోయి ఉన్నాం. మా బాధ వినండి. రాజకీయాలకు మేము అతీతం. మాకున్న చివరి అవకాశం చేజార్చకండి. ఇదేనా ప్రజాపాలన? దయచేసి ఆలోచించండి’’-గ్రూప్-1 అభ్యర్థులు

మరోవైపు తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షలకు దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం మాట్లాడుతూ గ్రూప్ వన్ అభ్యర్థులు కొన్ని పార్టీల మాటలు విని భవిష్యత్తు పాడు చేసుకోవద్దని, ఆందోళనలు విరమించి అందరూ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలని కోరారు. వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేక పోతున్నారని తెలిపారు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్థించాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక అన్నగా మీకు తోడుంటానని, అభ్యర్థులందరూ మెయిన్స్​కు సిద్ధం కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నిరసన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్​లు చేయవద్దని తెలిపారు.

21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు : రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. వీటికోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 46 ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. ఈ పరీక్షకు 33,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఎగ్జామ్ హాల్, చీఫ్‌ సూపరింటెండెంట్‌ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయ కమాండ్‌ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు.

మీ అన్నగా నేనున్నాను - ఆందోళన విరమించి మెయిన్స్​కు సిద్ధంకండి : రేవంత్ రెడ్డి

గ్రూప్ 1 అభ్యర్థుల చలో సెక్రటేరియెట్​లో ఉద్రిక్తత - మద్దతు పలికిన విపక్షాలు

ABOUT THE AUTHOR

...view details