Telugu Language Day at Tummalapalli Kalakshetram Vijayawada :ఏ ప్రాంతం ఉనికైనా అక్కడి భాషపై ఆధారపడి ఉంటుంది. అందుకే మాతృ భాషను పరమళింపజేయాలి. భాషాభివృద్ధితో సంస్కృతి, సంప్రదాయాలకు జీవం ఉంటుంది. కవులు, రచయితలు, ఉపాధ్యాయులు ఇందుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. బిడ్డ శరీరానికి తల్లి పాలు ఎంత అవసరమో, మనోవికాసానికి మాతృభాష అంతే అవసరం. శిశువు తన తొలి పాఠాన్ని తల్లి దగ్గరే నేర్చుకుంటుంది. బిడ్డలపై విదేశీ భాషను రుద్దడం మాతృదేశానికి ద్రోహం చేయడమే అవుతుంది.
ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్ధులు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్లం బోధిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చేర్పిస్తున్నారు. యువతరంలో అధికశాతం మందికి తెలుగు భాష రాయడం, చదవడం కూడా రావడం లేదు. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. గ్రాంథిక భాషపై పోరాడి, విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యావహారిక భాష వ్యాప్తికి ఉద్యమం లేవనెత్తిన ధీశాలి గిడుగు. భాషను సరళీకరించి అందరికీ అర్థమయ్యేలా చేయడంలో ఆయన కృషి అనితర సాధ్యం. ఆ స్ఫూర్తిని యువతరం అందుకోలేకపోతోందనేది భాషాభిమానుల ఆవేదన.