YSRCP leaders Join In TDP :వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఖాళీ అయింది. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే కూటమి అధికారంలోకి రావాలని నాయకులు తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
- ఎన్టీఆర్ జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలోని 18 వ వార్డులో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో 45 కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరితోపాటు వైసీపీ బూత్ కన్వీనర్ గోపి పసుపు కండువా కప్పుకున్నారు. జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో టీడీపీ నేత శ్రీరాం చినబాబు సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు.
వేడెక్కిన రాజకీయాలు - ఓవైపు ప్రచార హోరు, మరో వైపు వలసల జోరు - ELECTION CAMPAIGN IN AP
- కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో మోపిదేవి మండలం కె.కొత్తపాలెం ఎంపీటీసీ లత, మరో ఇరవై మంది జనసేన పార్టీలో చేరారు. 22వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు మండలి తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
- పల్నాడు జిల్లా గురజాలలో కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. చిలకలూరిపేటలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో చిలకలూరిపేటకు చెందిన 80 కుటుంబాలతోపాటు గంగన్నపాలేనికి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
- తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీక్ షాక్ తలిగింది. డక్కిలిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి, వైసీపీ నేత, మాజీ మండల కన్వీనర్ రంగినెని రాజా మరో ఏడుగురు సర్పంచ్‌లు టీడీపీలో చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవ్ నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.