viveka murder case updates :దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మంగళవారం అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి వెళ్లిన ఆమె.. సీఎంవో అధికారుల్ని కలిసి తన తండ్రి హత్యకేసు పురోగతిపై ఆరా తీశారు. సునీత తన తండ్రి కేసు విచారణకు సంబంధించి చంద్రబాబును కలవడం ఇది రెండోసారి. ఇటీవల డాక్టర్ సునీత దంపతులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కేసు పూర్వాపరాలను వివరించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు గురించి తెలిపారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు స్పందిస్తూ తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని వైఎస్ సునీత కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
చంద్రబాబుతో భేటీకి ముందు వైఎస్ సునీత ఆగస్టు 7న హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హంతకులకు అండగా నిలిచిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై అనిత స్పందిస్తూ కేసు సీబీఐ విచారణలో ఉన్నందున తమ నుంచి, ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూస్తామని, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అదే రోజు సాయంత్రం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుని సునీత కలిసి వివేకా హత్య కేసు పూర్వాపరాలను వివరించారు.