YS Sharmila gave a reply to CM Jagan allegations:జగన్ ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. వైఎస్‌ఆర్ బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్ చెప్పారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్ కోరారు, కానీ జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదని జగన్ చెప్పారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడారని షర్మిల ప్రశ్నించారు. సీఎం జగన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రత్యేక హోదా కోసం ఏపీలో అడుగుపెట్టానని షర్మిల పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్ర ప్రభుత్వం తో పోరాడటానికి మాత్రమే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు తెలిపారు.
తాను చంద్రబాబుతో టచ్లో ఉన్నట్టు సీఎం జగన్ ఆరోపిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు కు అమ్ముడుపోయినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. కేవలం తన కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే చంద్రబాబును కలిశానని, అంతకు మించి మరో సారి చంద్రబాబును కలిసింది లేదని పేర్కొన్నారు. సునీతా న్యాయం కోసం పోరాడుతుంటే, సునీతా చంద్రబాబుతో చేతులు కలిపిందని దారుణ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు మాట వింటారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. జగన్‌కు అద్దంలో చూసుకుంటే చంద్రబాబు ముఖమే కనబడుతుందా? అని ఎద్దేవా చేశారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని దుయ్యబట్టారు. జగన్‌కు ఓ అద్దం పంపుతున్నా.. ఈ అద్దంలో జగన్ చూసుకోవాలి, అద్దంలో తానే కనిపిస్తున్నారో.. చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలని షర్మిల ఎద్దేవా చేశారు.