ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్​ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ

RTC buses for CM Jagan's Raptadu meeting : 'సిద్ధం' పేరిట జగన్‌ నిర్వహిస్తున్న సభలు సామాన్యులకు నరకం చూపుతున్నాయి. సభలకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో గమ్యస్థానాలను చేరేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ పడిగాపులు కాసినా ఒక్క బస్సు రాకపోవడంతో ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు అధిక ఛార్జీలు చెల్లించలేక ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సభల్లో బల ప్రదర్శన కోసం పార్టీ శ్రేణులను, జనాలను బలవంతంగా తరలించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఆర్టీసీతో పాటు, ప్రైవేటు పాఠశాలలు, ఆలయాలకు వెళ్లే బస్సులనూ వదలడం లేదు.

rtc_buses_for_cm_jagans_raptadu_meeting
rtc_buses_for_cm_jagans_raptadu_meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 7:23 AM IST

Updated : Feb 18, 2024, 10:41 AM IST

జగన్​ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ

RTC buses for CM Jagan's Raptadu meeting: 'సిద్ధం' పేరిట సీఎం జగన్‌ నిర్వహిస్తున్న సభలు ప్రయాణికులకు శాపంగా మారుతున్నాయి. రాప్తాడులో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఏకంగా మూడు వేల బస్సులను కేటాయించిన ఆర్టీసీ యాజమాన్యం చివరకు తిరుమల, శ్రీ కాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులనూ వదల్లేదు. ప్రయాణికులు, భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా జనం గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. సభకు బస్సులన్నీ తరలించడంతో రాయలసీమ అంతటా శనివారం మధ్యాహ్నం నుంచి బంద్‌ వాతావరణం తలపించింది. కొన్ని బస్టాండ్లు బోసిపోయాయి. అరకొరగా ఉన్న బస్సులతో రద్దీ ఏర్పడి కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై మండిపడుతున్నారు.

సీఎం సభ కోసం వేలాది ఆర్టీసీ బస్సులు తరలింపు- ఎక్కడి ప్రయాణికులు అక్కడే!

మాది పేదల ప్రభుత్వమంటూ మాటలతో ఊదరగొట్టే జగన్‌, అధికారం చేపట్టిన నాటి నుంచి సామాన్యులను ప్రత్యక్షంగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. సాధారణ ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో అధికార పార్టీ పెట్టే సభలకు మళ్లించి అవస్థలకు గురి చేస్తున్నారు. పేదలు ఎలాపోతే నాకేంటి, మా సభలకు బస్సులు ఉంటే చాలు అనేలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. నిరుపేద ప్రయాణికులకు సేవలందించాల్సిన ఆర్టీసీ యాజమాన్యం, అధికార పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోంది. ప్రతిపక్షాల సభలకు పదుల సంఖ్యలో బస్సులడిగినా ఇవ్వని యాజమాన్యం, అధికార పార్టీకి మాత్రం అప్పజెబుతూ స్వామిభక్తి చాటుకుంటోంది. రాప్తాడులో నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభకు వేల సంఖ్యలో బస్సులు కేటాయించింది.

వైఎస్సార్సీపీ 2022 జులైలో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించిన ప్లీనరీకి ఆర్టీసీ 1857 బస్సులను కేటాయించింది. గతనెల 27న భీమిలి సమీపంలో జరిగిన సిద్ధం సభకు 850, ఈ నెల 3న దెందులూరు సభకు 1357 బస్సులు తరలించింది. రాప్తాడు సభకు ఏకంగా 3 వేల బస్సులు అప్పగించింది. ఇలా ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అధికార పార్టీకి మోకరిల్లుతోంది. వేలాది బస్సులు ఒకేసారి మళ్లిస్తే ప్రయాణికుల రాకపోకలు ఎలా సాగిస్తారనేది ఏమాత్రం తెలిసీ పట్టించుకోవడంలేదు. ఇదేమని ప్రశ్నిస్తే డబ్బులు చెల్లిస్తే ఏ పార్టీకి, ఏ వ్యక్తులకైనా అడిగినన్ని బస్సులు ఇస్తామని ఆర్టీసీ అధికారులు నీతి వాఖ్యాలు వల్లిస్తున్నారు.

వాస్తవాలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం గత ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడుకు, ఇటీవల విజయనగరం జిల్లాలో నిర్వహించిన యువగళం ముగింపు సభ కోసం బస్సులు అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు. అడ్వాన్స్‌ తీసుకుని బస్సులు పంపాలని టీడీపీ నేతలు వివిధ డిపోల అధికారులను కలిసినా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఆర్టీసీ ఎండీకి లేఖరాసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇదిగో అదిగో అంటూ చివరికి ముఖం చాటేశారు.

సీఎం సభకు బస్సులు- ప్రయాణికులకు తిప్పలు

ఆర్టీసీలో సొంత బస్సులు, అద్దె బస్సులు కలిపి 10 వేలు ఉండగా, అందులో 3 వేల బస్సులు ఒకేసారి మళ్లించడంపై ఆర్టీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమలోని 8 జిల్లాల నుంచి 2,500 బస్సులు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి మరో 500 బస్సులను కేటాయించారు. గుంటూరు నుంచి రాప్తాడులో సభ జరుగుతున్న ప్రాంతం 450 కిలో మీటర్ల దూరంలో ఉన్నా బస్సులు పంపారు.

దూర ప్రాంతాలకు చెందిన బస్సులన్నీ శనివారం రాత్రికే, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 13 జిల్లాల నుంచి సిద్ధం సభకు బస్సులు తరలించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులకు శనివారం ప్రత్యక్ష నరకం కనిపించింది. ముఖ్యంగా రాయలసీమ 8 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులన్నీ సీఎం సభకు మళ్లించారు. దీంతో ఏ మార్గంలోనూ బస్సుల జాడే కనిపించలేదు. ప్రయాణికులు బస్సుల కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమలకు, కాణిపాకం, శ్రీకాళహస్తి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. అడపా, దడపా ఒకటి, రెండు బస్సులు వచ్చినా వాటిలో కాలు పెట్టేందుకు కూడా ఖాళీ లేనంత రద్దీగా మారాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి అనంతపురం వెళ్లిన 500 బస్సులు సోమవారం రాత్రికి గానీ వెనక్కి వచ్చే అవకాశం లేదు.

విశాఖలో సీఎం సభకు ఆర్టీసీ బస్సులు తరలింపు - ప్రయాణికులకు ఇక్కట్లు

సాధారణంగా ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు బస్సులు బుక్‌చేసుకుంటే ముందే అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు మాత్రం వైఎస్సార్సీపీ పూర్తిగా సొమ్ము చెల్లించలేదని తెలిసింది. 3 వేల బస్సులకు 10 కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇందులో 7 కోట్ల వరకే పార్టీ తరఫున చెల్లించారు. అయినాసరే అన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు పంపేశారు. రాప్తాడు సిద్ధం సభకు అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల నుంచి 2 వేల ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను బలవంతంగా మళ్లించారు. అధికారపార్టీ నేతల ఆదేశాలతో స్వయంగా రవాణాశాఖ అధికారులే ఈ బస్సులు తరలించేలా చర్యలు చేపట్టగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేసి బస్సులు పంపాల్సిందేనని అధికారులు ఒత్తిళ్లు చేశారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి రాప్తాడు 250 కిలో మీటర్ల దూరం ఉంది. అలాగే వైఎస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల నుంచి 200 కిలో మీటర్ల దూరం ఉన్నా ఆ ప్రాంతాల నుంచి కూడా బడి బస్సులను తరలించారు. సభ బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులు ఉండేందుకు రాప్తాడు ప్రాథమిక పాఠశాలను కేటాయించగా విద్యార్థులకు అర్ధాంతరంగా సెలవు ప్రకటించారు.

రాప్తాడులో సిద్ధం సభ సందర్భంగా ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌ 544 డీ, ఎన్‌హెచ్‌ 42 రహదారుల మీదుగా వెళ్లే సరకు రవాణా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అనంతపురం నగరానికి ఆనుకుని ఉన్న రాప్తాడు వద్ద ఎన్‌హెచ్‌44, ఎన్‌హెచ్‌42 జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో వేదిక ఏర్పాటు చేశారు. సభకు 20 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్‌ను మళ్లించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో అదనంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సభకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు- దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విలవిల

Last Updated : Feb 18, 2024, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details