Andhra Pradesh Land Titiling Act 2023 : భూమి ఒక భరోసా, ఆపదలో ఆసరా, ఆకలి తీర్చే అక్షయ పాత్ర. బిడ్డల ఉన్నత చదువులకైనా, ఇంట్లో ఎదుగుతున్న కూతురు వివాహానికైనా, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఊహించని ఆపద ఎదురైనా భూమి తానున్నానంటుంది. భూమి కంటికి కనిపించని ఆభరణం. ఇలా ఎన్నో అవసరాలు తీరుస్తూ, ఆకాంక్షలను నెరవేర్చే ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే కుటుంబానికి భరోసా. సన్ని, చిన్నకారు రైతులైనా, చిరుద్యోగులైనా గుండె మీద చెయ్యి వేసుకుని, కంటి నిండా నిద్రపోతున్నాడన్నా, నలుగురిలో తలెత్తుకుని గౌరవంగా బతకుతున్నాడన్నా భూమి ఉండడమే కారణం. కానీ, మన భూమిని మరొకరు కబ్జా చేస్తే! నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే? వినడానికే భయంగా ఉంటుంది కదూ! కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాన్యుడికి భూమిపై హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. కోర్టులు, చట్టాలు ఉన్నా వాటికి అతీతంగా కొత్తగా భూమి హక్కు చట్టం (Andra Pradesh Land titling Act ) తీసుకొచ్చింది.
జీవో 512 తీసుకువచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు, భూ వివాదాల పరిష్కారానికి జిల్లాకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటుకు నిర్ణయించింది. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ల ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెప్తున్నా, కోర్టుల జోక్యం లేకపోవడం పలు అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది. భూవివాదాల పరిష్కారానికి చట్టం తెలిసిన న్యాయ కోవిదులను జగన్ పక్కన పెట్టేశారు. ప్రభుత్వం నియమించే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(TRO) ఉంటారు. ఏ వ్యక్తినైనా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించవచ్చని నిబంధనలు రూపొందించారు. అధికార పార్టీ అనుకూల వర్గాన్ని నియమించి భూముల పందేరానికి పాల్పడే ప్రమాదం లేకపోలేదు. నూతన భూ హక్కు చట్టం ద్వారా చిన్న, సన్నకారుల రైతులు నష్టపోతారని లాయర్లు గగ్గోలు పెడుతున్నారు. భూ సమస్యను కోర్టుల దృష్టికి తీసుకు రాకుండా ట్రిబ్యునల్‌కు వెళ్తే అక్కడ అధికార పార్టీ నాయకులకే లబ్ధి జరుగుతుందని బల్లగుద్ది చెప్తున్నారు.