Telugu Desam Party leaders boycotted the Governor's speech : బై బై జగన్ అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్స్ పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. సభకు వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకెక్కడదని నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బారికేడ్లను తోసుకుంటూ ప్లకార్డులు చేత పట్టుకుని కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. జాబ్ క్యాలెండర్ విడుదల, పోలవరం పూర్తి ఎక్కడా అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏముంటుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం MLAలను చూసి జగన్ భయపడుతున్నారని, అందుకే పోలీసుల సాయంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
నవ్వులపాలు చేసేలా గవర్నర్ ప్రసంగం : గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది కాబట్టే బహిష్కరించి బయటకు వచ్చామని తెలుగు దేశం పార్టీ నేతలు తెలిపారు. 36పేజీల ప్రసంగం మసిపూసిన మారేడుకాయేనని విమర్శించారు. ప్రభుత్వ అబద్దాలు చదవటానికి గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర లో చెప్పిన అబద్దాలు లాంటివే అసెంబ్లీలో గవర్నర్ చేతా పలికించారని నేతలు విమర్శించారు. అబద్దాలను కూడా నిస్సిగ్గుగా చెప్పటం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల్ని మోసగించటానికి గవర్నర్ ని కూడా వాడుకోవడం దుర్మార్గమన్నారు. నచ్చిన సమయానికి అసెంబ్లీ నడుపాతం అన్నట్లు 15నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారని దుయ్యబట్టారు. ప్రజా స్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా గవర్నర్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి తయారు చేయించారని నేతలు ఆక్షేపించారు.
అబద్దపు హామీల పునాదులపై కట్టిన వైసీపీ గోడలు కూలిపోతున్నాయి: టీడీపీ నేతలు