Telangana High Court Hearing on KTR Quash Petition:ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది.
మరోవైపు హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కౌంటర్‌పై కేటీఆర్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
వాదనలు జరిగాయిలా:ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్‌నే దాన కిషోర్ కౌంటర్‌గా పరిగణలోకి తీసుకోవాలా అని అదనపు అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. కౌంటర్‌పై నిర్ణయాన్ని తెలపడానికి అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి సమయం కోరారు. ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించాలని, కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ 31వ తేదీ వరకు పొడిగించారు. తదుపరి విచారణను కూడా ధర్మాసనం అదేరోజుకు వాయిదా వేసింది.