ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కొందరి మెదళ్లలో మూసీ మురికి కంటే ఎక్కువ విషం - అందుకే దుష్ప్రచారం: రేవంత్​రెడ్డి

మూసీ పునరుజ్జీవనం కోసం 5 కన్సల్టెన్సీ సంస్థలు - అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున జీవించాలని సవాల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Musi River Development
Musi River Development (ETV Bharat)

CM Revanth Reddy On Musi River Development : హైదరాబాద్‌ మహానగరంలో మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి విపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో విస్తృతంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని, నది పునరుజ్జీవనం మాత్రమేనని స్పష్టం చేశారు. నగరం మధ్య నుంచి నది వెళ్తున్న రాజధాని మరొకటి దేశంలో లేదన్న సీఎం దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించే మూసీ కాలుష్యానికి ప్రతీకగా మారిందని గుర్తు చేశారు.

1600కుపైగా నివాసాలు పూర్తిగా మూసీ నది గర్భంలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ ను నిర్దేశించే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్న ఆయన 33 బృందాలు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయని వివరించారు. దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారికి మెరుగైన జీవితం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం స్పష్టం చేశారు. కొంతమంది తమ మెదళ్లలో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకొని ప్రజలను తవ్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

మూసీ పునరుజ్జీవనం కోసం 5 కన్సల్టెన్సీ సంస్థలు పని చేస్తున్నాయన్న సీఎం, ప్రభుత్వం 141 కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందాన్ని లక్షన్నర కోట్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

"ఇది సుందరీకరణ కోసం కాదు. ఆ విధానం మాది అంతకంటే కాదు. మేము మూసీ నదిని పునరుజ్జీవం చేయాలి. మూసీ మురికిలో కాలం వెల్లదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి. వాళ్లకొక మంచి జీవనవిధానాన్ని ఏర్పరచి, ఉపాధి అవకాశాలను కల్పించాలన్నది మా ధ్యేయం."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున జీవించాలని సవాల్ విసిరిన రేవంత్ మూసీ పునరుజ్జీవనంపై సందేహాలు అంటే అసెంబ్లీలో చర్చిద్దామని, సలహాలు ఇవ్వాలని సూచించారు.పరిహారంపై విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన రేవంత్‌, మల్లన్నసాగర్‌, వేములఘాట్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలన్నారు.

చినుకు పడితే హైదరాబాద్‌లో గంటల కొద్దీ ట్రాఫిక్‌జామ్ అవుతోందన్న సీఎం వరదలు వచ్చి నగరం మునిగిపోతే అప్పటికప్పుడు ఏమైనా చేయగలమా అని ప్రశ్నించారు. ఐదారేళ్లపాటు శ్రమించి మూసీ పునరుజ్జీవాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనానికి ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించనున్నట్టు తెలిపారు.

ఆ ముగ్గురూ మూసీ ఒడ్డున ఉంటారా? :మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని బీఆర్ఎస్​ నేత కేటీఆర్‌ అనలేదా అని ప్రశ్నించిన రేవంత్​రెడ్డి, అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు పాటు మూసీ ఒడ్డున జీవించి చూపాలని సవాలు విసిరారు. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఈటల రాజేందర్​ 3 నెలలు మూసీ ఒడ్డున ఉండాలని, వాళ్లు 3 నెలలు అక్కడ ఉంటామంటే కావాల్సిన వసతులు కూడా కల్పిస్తామని విమర్శించారు. ఆ ముగ్గురూ మూడు నెలలు అక్కడ ఉంటే, ఈ ప్రాజెక్టును ఆపేస్తామన్నారు. మూసీ పరివాహకంలోనే ఉండి ప్రజల కోసం పోరాడాలి, వారి జీవితం బాగుందని నిరూపించాలని సీఎం అన్నారు. మూసీ ప్రజల కోసం ఏం చేద్దామో అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి లేదా మూసీ పునరుజ్జీవం కోసం వారి (విపక్షాలు) వద్ద ఉన్న ప్రణాళిక చెప్పాలని కోరారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలన్న సీఎం, విపక్ష నేతల సందేహాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details