TDP Nara Lokesh Sankharavam Election Campaign: ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేశ్ ప్రణాళికలు రూపొందించారు. నారా లోకేశ్ శంఖారావం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానుంది.
నారా లోకేశ్ శంఖారావం - ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభంకానున్న ఎన్నికల ప్రచారం ఈ మేరకు శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, షరీఫ్, టీడీ జనార్దన్‌లు విడుదల చేశారు. ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ చైతన్యం నింపటమే శంఖారావం లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం కార్యక్రమానికి లోకేశ్ సారథ్యం వహిస్తారన్నారు.
ప్రతి రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు శంఖారావం పర్యటన సాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 11వ తేదీన ఉదయం 9 గంటలకు శంఖారావం తొలిసభ జరుగుతుందన్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం సాగుతుందని వెల్లడించారు.
ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు ఇచ్ఛాపురంలో ప్రారంభం కానున్న లోకేశ్ యాత్ర, అదే రోజు పలాస, టెక్కలిలోనూ కొనసాగనుందని తెలిపారు. 12వ తేదీన నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలసల్లో లోకేశ్ పర్యటిస్తారు. 13వ తేదీన పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. లోకేశ్ పర్యటన తొలిదశలో 11 రోజుల పాటు 31 నియోజకవర్గాల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్‌తో లోకేశ్ సమావేశమవుతారు.
చైతన్యం రగిల్చిన యువగళం పాదయాత్ర: కాగా గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. అధికారపార్టీ పెద్దల అవినీతి, దౌర్జనాలను ఎండగడుతూ 226 రోజుల పాటు 3132 కి.మీ.ల మేర, 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా సాగింది. ఈ యాత్ర ద్వారా సుమారు కోటి మంది ప్రజలను నారా లోకేశ్ నేరుగా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు.
ఉత్తరాంధ్రలో కూడా యువగళం పాదయాత్ర కొనసాగాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు అరెస్టు కారణంగా 79 రోజులపాటు యాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వ తేదీన లోకేశ్ యువగళం పాదయాత్రను అనివార్యంగా ముగించారు. యువగళం ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం పేరుతో నిర్వహించిన బహిరంగసభ చరిత్ర సృష్టించింది.
ఆ కసి నాలో ఉంది - రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా చేస్తా : లోకేశ్