State Cabinet Approves Land Titling Act Repeal Bill : సచివాలయంలో దాదాపు 2 గంటలకుపైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. అలాగే ఇసుక తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి సమ్మతి తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు NCDC నుంచి 3వేల200 కోట్ల రుణానికి ఆమోద ముద్ర వేసింది. వ్యవసాయ, సహకార కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి సైతం ఆమోదం తెలిపింది. కౌలు రైతులకు సరైన ఆర్థిక సాయం అందట్లేదన్న ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారన్న మంత్రి పార్థసారథి మరింత మెరుగ్గా, సులభతరంగా రుణాలు అందించేలా చూడాలని ఆదేశించారని చెప్పారు. ఏపీ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచానికి మార్గదర్శకంగా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారని, ఆ విధంగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రావటానికి ఆసక్తిగా ఉన్నా వైసీపీ అనే భూతం భయం పోలేదని మంత్రివర్గం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర అమాత్యులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అనే భూతాన్ని సీసాలో బంధించేశామనే విషయాన్ని ప్రచారం చేద్దామని మంత్రులు బదులిచ్చారు. స్వేచ్ఛగా బతుకుతున్నామనే భావనలోకి ప్రజలు వచ్చారనీ వారి అంచనాలను మన పనితీరుతో అందుకోవాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ సృష్టించే ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై మంత్రివర్గ సమావేశం ముగిశాక ఆసక్తికర చర్చ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును ఈ అసెంబ్లీలో పెడదామని, ఇది ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ప్రస్తుతం రైతుల వద్ద పాస్ పుస్తకం, టైటిల్ పుస్తకం ఉండగా ఇంకా టైటిలింగ్ చట్టం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలకు పెళ్లై పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తిని జిరాక్స్ కాపీలు ఇచ్చి పంపలేం కదా అని పవన్‌కళ్యాణ్ అన్నట్లు తెలిసింది. నీతి ఆయోగ్ చర్చ కోసం పెట్టిన ఓ డ్రాఫ్ట్ అడ్డం పెట్టుకుని చట్టం తెచ్చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధాన్యం సేకరణకు వెయ్యి కోట్లు రుణం తెచ్చి పాత బకాయిలు తీర్చామని, దీనిని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అన్నారు. పంటల బీమాపై వెంటనే ఏం చేయగలం, లాంగ్‌టర్మ్‌లో ఏమి చేయగలమో నివేదిక రూపొందించాలని సూచించారు. 100రోజుల్లో ఏం చేశామో ప్రజలకు ప్రభుత్వ పనితీరు కనబడాలని అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక అవసరానికి కానీ అమ్మకానికి కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి హితవు పలికారు. ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండకూడదని తేల్చిచెప్పారు. అక్రమాలు,అవినీతికి తావులేకుండా ఉచిత ఇసుక విధానం అమలు కావాలన్నారు.
ఈ నెల 22నుంచి 5రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయని వెల్లడించారు. తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయని తర్వాత శ్వేత పత్రాలపై చర్చిద్దామని చెప్పారు. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసగించిందని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 1600కోట్లు రుణం తెచ్చి వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగిలిన 600కోట్లు ఏమయ్యాయో ఇంకా తెలియట్లేదన్నారు.