Gun Firing At Nampally Today :హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. అనంతరం పరారవుతుండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారంతా దోపిడి దొంగలుగా అనుమానిస్తున్నారు.
15-year-Old Boy Is Among The Accused :కాగా నిందితుల్లో శాయినాజ్‌గంజ్ ఠాణా పరిధిలోని మనుగోడు బస్తీకి చెందిన 15 ఏళ్ల బాలుడిని గుర్తించారు. బుల్లెట్ ఆ బాలుడి తొడ భాగంలోకి దూసుకెళ్లింది. ఈ ముఠా రైల్వే స్టేషన్‌కి వచ్చే వారిని బెదిరించడం, చైన్ స్నాచింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. గాయపడిన నిందితుడు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
పటిష్ఠ నిఘా ఉంచిన అధికారులు :నగరంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని పెంచిన విషయం తెలిసిందే. పటిష్ఠ నిఘా ఉంచిన అధికారులు కాస్త అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నాంపల్లి పోలీసులు, యాంటీ డెకాయిట్ టీమ్ సంయుక్తంగా హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రించినపుడు వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో గురువారం అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించారు.