Police Arrest YSRCP Social Media Activist :వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వారు ఇష్టారీతిన చెలరేగిపోయారు. సోషల్ మీడియా వేదికగా విషం కక్కారు. పెద్దల అండ చూసుకొని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ చిత్రాలు, అసభ్య దూషణలతో పేట్రేగిపోయారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక సైతం ఇదే మాదిరి దండయాత్ర, దీంతో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటువంటివారిపై పోలీసులు తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు.
నేడు న్యాయస్థానంలో హాజరు :ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెట్టిన రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన వీరభత్తుల చంద్రశేఖర్ అనే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులను కించపరిచేలా వేరు వేరు పేర్లతో తప్పుడు ప్రచారానికి పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రాథమిక విచారణ అనంతరం 2 కేసులు నమోదు చేసి చంద్రశేఖర్‌ను అరెస్టు చేశామని గోపాలపురం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన యువకుడి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టామని అన్నారు. శుక్రవారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు.
వైఎస్సార్సీపీ సోషల్ సైకో నెట్‌వర్క్ - 50 వేల మందితో ఉన్మాదుల కర్మాగారం!
చంద్రశేఖర్‌ను రంగంపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు బుధవారం అర్ధరాత్రి స్టేషన్ ఎదుట, ఆ తర్వాత ఏడీబీ రోడ్డులో నిరసన చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు వీడియోకాల్‌లో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏర్పాటు చేశారు. అనపర్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ భార్య విజయ తదితరులు సీఐతో మాట్లాడారు.
41ఏ నోటీసులు జారీ :చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఇంకా మరికొందరు నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. 41ఏ నోటీసులు జారీ చేసి అరెస్టులకూ వెనుకాడడడం లేదు.