People Belief Towards Chandrababu :వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థలు శాశ్వతం.! పార్టీలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం.!! ఇదీ 2019 ఎన్నికల్లో ఆయన శిరస్సు వంచి ప్రజలందరికీ చెప్పిన మాట.! కానీ ఆయన చెప్పిన మాటలు జనం తేలికగా తీసుకున్నారు. మేకతోలు కప్పుకున్న తోడేలు రూపంలో ఉన్న జగన్ ఒక్కఛాన్స్ అని వేడుకుంటే అవకాశమిచ్చారు. ఇప్పుడు అదే తోడేలు మూతికి నెత్తురు అంటించుకుని వచ్చి ఇంకో ఛాన్స్ అని దీనంగా అడిగింది.
జనం ఒకరివైపు ఒకరు చూసుకుంటే ఒళ్లంతా ఆ తోడేలు చేసిన గాయాలే.! అందుకే జనం ఆ తోడేలును తరిమేశారు. అది చేసిన గాయాలకు కాస్త మందు రాసి బతుకుదెరువు చూపించే వారి కోసం వెతికారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు.! ఈ వయసులోనూ ఏదైనా క్షుణ్నంగా అధ్యయనం, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడే మనస్తత్వం, ఎవరూ దెబ్బతీయలేని ఆత్మస్థైర్యం, వీటన్నింటికీ మించి రాష్ట్రాభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఇవన్నీ ప్రజలు చంద్రబాబు వైపు చూసేలా చేశాయి.
రాష్ట్రాభివృద్ధి తప్ప మరో ధ్యాస లేని చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రం కోల్పోయిందేంటో ప్రజలకు విడమర్చి చెప్పడంలో సఫలీకృతులయ్యారు. విజనరీ, ప్రిజనరీ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లారు.! రాష్ట్రం నెత్తిన అప్పుల నిప్పులు పోసి, అభివృద్ధికి పాతరేసి, అంతులేని అరాచకాలకు తెరతీసి జగన్ సృష్టించిన సంక్షోభాలను జనంలోకి తీసుకెళ్లారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాల్లేవ్.! చెప్పుకోడానికి రాజధాని లేదు! తిరగడానికి సరైన రోడ్లు లేవ్! మొత్తంగా జనం తమ భవిష్యత్‌ను ఊహించుకోడానికే భయపడ్డారు. అందుకే రాష్ట్ర భవిష్యత్‌ను, తమ భద్రతను చంద్రబాబుకు అప్పగించారు. మళ్లీ రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేసే సత్తా ఉన్న చంద్రబాబుకే పట్టం కట్టారు.
చంద్రబాబు కూడా ఎన్నికల్లో ప్రజల్ని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేశారు. జగన్ హామీల అమల్లోని మోసాలను ఎండగడుతూనే అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల నాటికి లక్షా 25వేల కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర అప్పును జగన్ 12లక్షల కోట్లకు తీసుకెళ్లారు. దానితో సంపద సృష్టించే పనులేవీ చేయలేదని, తాము అధికారంలోకి వస్తే సంక్షేమంతోపాటు అభివృద్ధీ అందిస్తామని భరోసా ఇచ్చారు.
లక్షకుపైగా ఓట్లతో కూటమి ఎంపీ అభ్యర్థుల మెజారిటీలు - ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్ - NDA Alliance MP Candidates Leading
చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారన్నది జగన్ ముఠా ప్రధానంగా చేసిన ప్రచారం. దాన్ని సూపర్ సిక్స్‌తో తిప్పికొట్టారు చంద్రబాబు. మహిళల వంటింటి కష్టాలకు చెక్‌పెట్టేలా ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆడిబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయల పథకాలతో చంద్రన్నే కావాలని ఆడపడుచులు తీర్మానించుకున్నారు. జగన్ ఇంట్లో ఒక్కరికి 'అమ్మఒడి' ఇస్తే 'తల్లికి వందనం' పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇస్తామన్న హామీ కూడా చంద్రబాబు వైపు మొగ్గేలా చేసింది.
ఇక మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అనే సరికి రైట్ రైట్ అన్నారు. రైతు భరోసా పేరుతో జగన్ ఏటా ఏడున్నర వేలు మాత్రమే విదిలిస్తుంటే అన్నదాతకు చేయూత పేరుతో తాము 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ జగన్ చేతిలో మోసపోయిన యువతకు నెలకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగ కల్పన హామీలు భరోసా కల్పించాయి.
మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తానని మాటిచ్చారు! ఇలా ప్రతీ హామీకీ ష్యూరిటీ ఇస్తూ భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చిన బాబుకు జనం జైకొట్టారు. సూపర్ సిక్స్ దెబ్బకు జగన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. జగన్ తెచ్చిన భూహక్కు చట్టం వల్ల కలిగే ప్రమాద తీవ్రతను పసిగట్టి ప్రజలకు అవగాహన కల్పిండం కూడా చంద్రబాబుకు కలిసొచ్చింది. అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన భూ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ఇచ్చిన భరోసాను జనం నమ్మారు.
ఇది అక్కాచెల్లెమ్మల తీర్పు - ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు కోరిన మార్పు! - ap elections 2024
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అరాచకంపై అధికార పార్టీకి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. జగన్ మళ్లీ వస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదనే విషయం ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా చేయగలిగారు. భూములు కాజేసే బకాసురుల కన్నా రక్షణ కల్పించే బాబే కావాలని జనం అనుకున్నారు. సామాజిక పింఛన్ల విషయంలో జగన్ చేసిన మోసం జనాన్ని చంద్రబాబు వైపు మళ్లేలా చేసింది. పింఛన్‌ను 3 వేలకు పెంచేందుకు జగన్ ఐదేళ్లు సమయం తీసుకున్నారనే విషయాన్ని చంద్రబాబు ప్రజలకు వివరించారు.
తెలుగుదేశాన్ని గెలిపిస్తే పింఛన్ మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఐతే ఇదంతా మోసగించేందుకేనని జగన్ ఎంత మొత్తుకున్నా 2014లో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన చంద్రబాబు అనుభవాన్ని చూసి ఓటర్లు ఆదరించారు. ఇక ప్రతి కుటుంబానికీ 25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేస్తానన్న హామీతో ఆరోగ్య భద్రత కూడా దక్కుతుందని ప్రజలు నమ్మారు. పేదలకు గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల్ని ఆకర్షించారు.
నిజానికి జగన్ చేసిన పాపాలే చంద్రబాబువిజయానికి మెట్లుగా పనిచేశాయి.! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఐదేళ్లలో విచ్చలవిడిగా దాడులు జరిగాయి. వారికి రక్షణ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించేలా చట్టం తెస్తామన్నారు. ఇక జగన్ నిర్వీర్యం చేసిన వివిధ కార్పొరేషన్లకు మళ్లీ పునరుజ్జీవం పోస్తామని, ఆదరణ పథకం ద్వారా బీసీలకు పనిముట్లు అందజేస్తామని కొండంత భరోసా ఇచ్చారు.
వైఎస్సార్సీపీ ఇసుకాసురుల్ని బంధించి మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో ప్రకటించడం, భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి కొండంత భరోసానిచ్చింది. ఇక వాలంటీర్లను జగన్ సొంత సైన్యంలా మలచుకుని అరాచకాలు సృష్టిస్తే వాళ్లతోనే అద్భుతాలు చేయిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన వాలంటీర్లలో పెను మార్పునకు దారితీసింది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారనే జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాలంటీర్లకు ఇప్పుడిస్తున్న 5వేల వేతనాన్ని 10వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తద్వారా వాలంటీర్ల ఓట్లూ ఆకర్షించారు. జగన్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికల్లో తన విజయానికి దోహదపడుతుందనుకున్న ఏ ఒక్క అంశాన్నీ చంద్రబాబు వదులుకోలేదు. ఐదేళ్లలో జగన్ చేసిన నష్టాన్ని వివరించడంలో ఏ ఒక్క వేదికనూ వదలలేదు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే సమర్థతకు పట్టం కట్టాలని భావించిన ప్రజలు భారీ ఆధిక్యంతో చంద్రబాబును ఆశీర్వదించారు.
జగన్ చేసిన పాపాలే చంద్రబాబు విజయానికి మెట్లు (ETV Bharat)