Jagan Tirumala Issue : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ వివాదం తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందించారు. మాజీ సీఎంపై వారు విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్‌కు శ్రీవారి అనుగ్రహం లేదని స్వామివారి ఆశీర్వాదం లేకుంటే ఎవరైనా సరే అలిపిరిలో అడుగుపెట్టలేరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటా : శ్రీవారి దర్శనానికి వచ్చే జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి ఏమి బాధని భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే అని గుర్తుంచుకోవాలని చెప్పారు ఇకనైనా అహంకారం మానుకోవాలని హితవు పలికారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో, తిరుమలలో గాని ఏరోజు దళితులను ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. వారిని ఇబ్బందులకు గురి చేశామని మాజీ ముఖ్యమంత్రి అన్నారని ఆ విషయాన్ని 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. దళితులను కించపరిచినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని, నిరూపించకుంటే రాజకీయాల నుంచి జగన్ పూర్తిగా తప్పుకుంటారా అని సవాల్ విసిరారు.
కోర్టులో తన కేసుల వాయిదాలకు డుమ్మా కొట్టడానికే జగన్ తిరుమల పర్యటనను అడ్డుపెట్టుకున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమలలో అల్లర్లు, మతకల్లోలం సృష్టించడానికి యత్నించారని ధ్వజమెత్తారు. లడ్డూలపై విష ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి రోజాపై టీటీడీ కేసు పెట్టాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.