Kandambari Jethwani case :ఫోర్జరీ పత్రం ఆధారంగా నటి కేసు పెట్టిన పోలీసులు.. దాని పూర్వాపరాలపై పెద్దగా దృష్టి సారించకుండా చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు కాబట్టి అంత వరకే తమ పని అన్నట్లు వ్యవహరించారు విజయవాడ పోలీసులు. వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అతని ఆస్తిని ఇతరులకు విక్రయించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నటి, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. అసలు బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రం విషయంలో పరిశీలనను గాలికొదిలేశారు. ఈ పత్రానికి సంబంధించిన వివరాలు కావాలని అప్పట్లో దర్యాప్తు అధికారి ముంబయి జాయింట్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అటు నుంచి ఇప్పటి వరకు వివరాలు రాలేదు.
కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు - సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర - Mumbai Actress Case Updates
ముంబయి నటి కేసు దర్యాప్తు లోతుగా జరుగుతుంది. రూ. వంద స్టాంపు పత్రంపై 2018, నవంబరులో విద్యాసాగర్‌కు చెందిన భూమిని నటికి రాసిచ్చినట్లు అమ్మకం ఒప్పందం పత్రాన్ని సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో అభియోగాలు మోపారు. ఈ పత్రం నకిలీదని చెప్పేందుకు హీరోయిన్ పలు ఆధారాలను పోలీసులకు ఇటీవల సమర్పించారు. ఆరేళ్ల క్రితం రాసినట్లుగా చెబుతున్న ఆ పత్రంలో జెత్వానీ కొత్త చిరునామాను చేర్చడం గమనార్హం. ఆ సమయంలో తాను వేరే చిరునామాలో ఉంటున్నట్లు ఆమె రుజువులు చూపించారు. ఈ పత్రంపై ఆమె సొంతంగా పరిశోధన కూడా చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లి 80ఏఏ714164 నెంబరు గల డాక్యుమెంట్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారు? అన్న వివరాలను ఆరా తీశారు. దానిని గత ఏడాది నవంబరులో కొన్నట్లు మాత్రమే వివరాలు సంపాదించినట్లు ఆమె ఇటీవల ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా.. సహ చట్టం కింద దరఖాస్తు చేయమనడంతో తాను వెనుదిరిగినట్లు చెప్పారు.
గత సంవత్సరం ఆఖరులో కొనుగోలు చేసిన పత్రంపై 2018లో ఒప్పందం జరిగినట్లు సృష్టించడంలో కీలక సూత్రధారులు ఎవరు? అన్న దానిని పోలీసులు వెలికితీసే అంశంపై దృష్టి సారించారు. గతంలో కేవలం లేఖ రాసి వదిలేసిన తర్వాత నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు. నిందితుడిని రైలులో విజయవాడకు తీసుకువస్తున్నారు. నేటి సాయంత్రానికి నగరానికి చేరుకోనున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టు రూపొందించడంలో పోలీసులు తలమునకలయ్యారు. నటిని అరెస్టు చేసిన కేసులో పేర్కొన్న సాక్షులను పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. మొత్తం ఆరుగురు సాక్షుల్లో ఇప్పటికే ఐదుగురిని విచారించి వారి స్టేట్‌మెంట్లను తీసుకున్నారు. వారు అప్పట్లో ఎవరి ఒత్తిళ్లతో స్టేట్‌మెంట్ ఇచ్చింది? వాస్తవ పరిస్థితి ఏంటి? అన్న వివరాలను వారి నుంచి రాబట్టారు. ఈ వివరాలను విద్యాసాగర్ ఇంటరాగేషన్‌లో నిర్థారించుకోనున్నారు.
ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్, విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపర్చాలని నటి పోలీసుకమిషనర్ రాజశేఖర్‌బాబుకు లేఖ రాయనునున్నట్లు తెలుస్తోంది. ఆమెను అరెస్టు చేసి.. అప్పట్లో ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను భద్రపర్చాలని కోరనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో కమాండ్ కంట్రోల్‌లో , ఆమెతో పాటు తల్లిదండ్రులను విచారించారు. ఈ సమయంలో ఎవరెవరు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోకి వచ్చింది? ఎంత సేపు ఉన్నారు? తదితర వివరాలు వెలుగులోకి రావాలంటే అక్కడి కెమెరాల్లోని ఫుటేజీని కూడా భద్రపర్చమని లేఖలో కోరనున్నట్లు తెలిసింది.
ఐ ఫోన్లు ఓపెన్ కాకపోవడంతో డేటా డిలీట్ చేయాలని చూశారు: ముంబయి నటి - Mumbai Actress Meet Home Minister
జెత్వానీ ఐఫోన్లలో ఆధారాలు చెరిపేందుకు విఫలయత్నం - వెలుగులోకి పీఎస్ఆర్ అరాచకాలు - Kadambari Jethwani Case Updates