MLA Vasantha Krishna Prasad Meeting with Leaders and Supporters: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావును నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రమాదేవి మర్యాద పూర్వకంగా కలిశారు. తాజాగా వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీ అధిష్ఠానం సీటు కేటాయించలేదు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి మైలవరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కలుస్తున్నారు.
మైలవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా తిరుపతిరావును సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలోకి వెళ్తారని ప్రచారం ఉంది. దీంతో వసంత మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు.
చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయి: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇన్‌ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం మొండిచేయి: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు తొలనుంచీ మంత్రి జోగి రమేశ్‌తో విభేదాలున్నాయి. కృష్ణప్రసాద్‌ను సీఎం పిలిచి మాట్లాడారు. మైలవరం టికెట్ తనదేనని, ఇకపైన జోగి అక్కడ కలుగజేసుకోరు అని హామీ ఇచ్చి పంపారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారకపోవడంతో ఎమ్మెల్యే వసంత పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ వైసీపీ ఇన్‌ఛార్జిగా మంత్రి జోగి వర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారిందని, ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకున్నారని విమర్శించారు. బిల్లుల బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకుంటారో: దీనికి తోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేశ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంది. అదే విధంగా మైలవరం ఇన్‌ఛార్జిని మార్చడంతో వసంత కృష్ణప్రసాద్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ ఆరో జాబితాలో మళ్లీ అవే మార్పులు - ఎవరు ఎక్కడకు మారతారో అర్థం కాని పరిస్థితి