Ministers Committee Meeting on Price Monitoring:రైతులు, రైస్ మిల్లర్లకు బకాయిల చెల్లింపులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అంతే కాకుండా పౌరసరఫరాలశాఖలో రూ.41,150 కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు. ధరల పర్యవేక్షణపై సచివాలయంలో మంత్రి నాదెండ్ల అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్న, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బియ్యం, కందిపప్పు, టమాట, ఉల్లి ధరల నియంత్రణపై మంత్రులు చర్చించారు. టమాట, ఉల్లి నిల్వ పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. మార్కెట్‌లో ధరల పరిస్థితిని సమీక్షించిన మంత్రులు, అధికారులు ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాలతో బియ్యం ధరల స్థిరీకరణ జరిగినట్లు గుర్తించారు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా కందిపప్పు ధరలు, కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగినట్లు వివరించారు. దిగుమతిదారులు, హోల్‌సేల్, రిటైల్ నిర్వాహకులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి.
అఘాయిత్యాలు ఇంకా కొనసాగితే నేనే హోంమంత్రి అవుతా - పోలీసులు ఏం చేస్తున్నారు? : పవన్ కల్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, పంచదార రాయితీపై సరఫరా అవుతుంది. కిలో కందిపప్పు రూ.67, అరకిలో పంచదార రూ.16 చొప్పున విక్రయాలు జరుగుతున్నట్లు తెలిపారు. రైతుబజార్లు, రాష్ట్రంలోని 2,200 ఔట్‌లెట్లలో విక్రయానికి ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో గత నెలలో ఉల్లి, టమాట ధరలు తగ్గాయని తెలిపారు. 154 మండల కేంద్రాల్లో సీపీ యాప్ ద్వారా రోజూ ధరల విశ్లేషణ జరుగుతున్నట్లు మంత్రులు గుర్తించారు.
గత ప్రభుత్వం రుణాలు తీసుకుని రైతులకు చెల్లించలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రూ.1,674కోట్ల బకాయిలను రైతులకు నెల రోజుల్లో చెల్లించామని వివరించారు. రైస్ మిల్లర్లకు గత ప్రభుత్వం రూ.961 కోట్లు బకాయిలు పెట్టిందని కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ ప్రారంభమయ్యేలోపే రూ.250 కోట్లు బకాయిలు చెల్లించామని తెలిపారు. మరో వారం రోజుల్లో రూ.200కోట్ల బకాయిలు చెల్లిస్తామని అన్నారు. మార్కెట్ సెస్ 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారని ఆ సెస్‌ను 1 శాతానికి తగ్గించేలా కేబినెట్‌లో ప్రతిపాదిస్తామని మంత్రి తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నివారణకు చర్యలు ఉంటాయని అన్నారు. ఎండీయూ యూనిట్ల కోసం గత ప్రభుత్వం రూ.1645 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇంటింటికీ రేషన్ పేరిట గత ప్రభుత్వం అవినీతి చేసిందని మంత్రి నాదెండ్ల అన్నారు.
ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతల ప్రోత్సాహకం రూ.7 కోట్లకు పెంపు
విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు - ప్రకటన జారీ చేసిన ఏపీఈఆర్‌సీ