KTR Sensational Comments On CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధానమంత్రి మోదీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని పేర్కొన్నారు.
తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభం అయిందని, బీజేపీ జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయం చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని కేటీఆర్ అడిగారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు.
తెలంగాణలో ఫాక్స్‌కాన్ విస్తరణ హుష్‌కాకి అయ్యిందా? : సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించిన ఆయన, ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తే పోలీసులు ఏం చేయాలని అడిగారు. ప్రభుత్వ ఆస్తులపై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంకు సంబంధించిన మీడియా వాళ్లు ఒక ఐపీఎస్ అధికారిపై దాదాపుగా దాడికి వెళ్లారని, ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని కోరారు.