Jharkhand MLAs in Hyderabad : హైదరాబాద్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రత మధ్య శిబిరంలో సురక్షితంగా ఉంచారు. శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో 36 మంది ఉన్నారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసనసభలో 41 మంది మెజార్టీ ఉంటే వారిదే అధికారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎం మూడింటికి కూడా తగినంత మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న జేఎంఎం పార్టీతో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
మాజీ సీఎం అరెస్ట్‌పై విచారణకు సుప్రీం నో- హేమంత్ సోరెన్‌కు 5రోజుల రిమాండ్
Jharkhand MLAs Camp in Hyderabad :ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (Hemant Soren) కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన రాంచీ నగరంలో దాదాపు 12 ప్రాంతాల్లో 8.5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి హోదాలో తనపై కేసు నమోదు కావడంతో ఆయన రాజీనామా చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు, హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఝార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైన కూడా కొన్ని గంటల పాటు సందిగ్ధం నెలకొంది. చివరకు చంపయీ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నుంచి నిర్ణయం వెలువడింది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం చంపయీ సోరెన్(Champai Soren)తో గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభ్యుల బలం నిరూపించేందుకు గవర్నర్ పది రోజులు గడువు ఇచ్చారు.