Nagababu Counter to Jagan Comments :రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేదని, రెండు రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికే జగన్ దిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రషీద్ హత్యపై జగన్ శవ రాజకీయాలు చేయటం ఆపాలని హితవు పలికారు.
2019లో వైఎస్సార్సీపీ గెలిపిస్తే ప్రజల్ని వేధించారని, ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కాకముందే విమర్శలు చేస్తున్నారని నాగబాబు తప్పుబట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో జరిగిందని ఆరోపించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిని చేసి రోడ్డుపై కొట్టిన ఘటన, పదో తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఉదంతాలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని కానీ జగన్ మరోసారి రాకుండా చేసి ప్రజలు తమని తాము కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు.
పులివెందులలో జగన్ ఓడిపోతారు :ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన షాక్‌తో జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విమర్శించారు. జగన్ ఎన్డీఏ ప్రభుత్వంపై అబాండాలు మోపడం సరికాదని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన తీరును మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పులివెందులలో కూడా ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
క్షమాపణ కోరితే ప్రజలు హర్షిస్తారు :ఐదేళ్ల పాటు నేరాలు, ఘోరాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రగా మార్చిన జగన్ రెడ్డి నేడు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని జగన్ దిల్లీ వెళ్తున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన జగన్ దిల్లీ వెళ్లే నైతిక అర్హత కోల్పోయారని ఆయన మండిపడ్డారు. దిల్లీలో ధర్నా చేసేముందు ఆంధ్రాలోని గల్లీ గల్లీలో జగన్ తన అరాచక పాలన ఆనవాళ్లకు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరితే ప్రజలు హర్షిస్తారని అన్నారు.