ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

10 ఏళ్లుగా సాగుతున్న ఇందూటెక్​ స్కామ్​ కేసు​- వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్​ - సీఎం జగన్​ ఇందూటెక్​ స్కామ్

Indu Tech Scam Case: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హత లేకున్నా అడ్డగోలుగా దోచిపెట్టగా ప్రభుత్వ భూములను ఇందూ భోజనంలా ఆరగించారు. కన్సార్షియం మాటున నాడు జగన్ అనుయాయులు చేసిన జిమ్మిక్కులను సీబీఐ, ఈడీ బయటపెట్టినా పదేళ్లుగా విచారణ ముందుకు సాగడం లేదు.

Indu_Tech_Scam_Case
Indu_Tech_Scam_Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 7:10 AM IST

Updated : Feb 16, 2024, 9:26 AM IST

10 ఏళ్లుగా సాగుతున్న ఇందూటెక్​ స్కామ్​ కేసు​- వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్​

Indu Tech Scam Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాంటి సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలు లేకపోయినా జగన్ సన్నిహితుడన్న ఒకే ఒక్క కారణంతో శ్యాంప్రసాద్‌రెడ్డి హైదరాబాద్‌, నంద్యాలలో హౌసింగ్ ప్రాజెక్ట్​లను కట్టబెట్టారు.

కన్సార్షియం సమయంలో, టెండర్ సమయంలో చూపిన సంస్థలన్నీ పక్కకుపోయి ప్రాజెక్ట్‌లన్నీ శ్యాంప్రసాద్‌రెడ్డి వశమయ్యాయి. ఈ కుంభకోణంలో గచ్చిబౌలి ప్రాజెక్టులో వైవీ సుబ్బారెడ్డికి సగం వాటా దక్కడంతో పాటు జగన్‌కు రూ.20 కోట్లు చేరాయని సీబీఐ(Central Bureau of Investigation) 2014 సెప్టెంబరు 9న ఛార్జిషీట్‌ వేసింది. నిందితుల్లో వైఎస్‌ జగన్‌(CM YS Jagan), వి.విజయసాయిరెడ్డి, ఎస్‌.ఎన్‌.మొహంతి, ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులను చేర్చింది. అయితే ఈ కేసు పదేళ్లలో ఏకంగా 224 వాయిదాలుపడింది తప్ప.. నిందితులపై చర్యలు కాదుగదా కనీసం విచారణ కూడా జరగలేదు.

పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 2004లో ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డు గృహ నిర్మాణాల ప్రాజెక్టులను చేపట్టింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బండ్లగూడ, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలోని హౌసింగ్‌ ప్రాజెక్టులపై జగన్‌ సన్నిహితుడు ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి ఆసక్తి కనబరిచారు. సొంతంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక అర్హతలు ఆయనకు లేకపోవడంతో కన్సార్షియం పేరిట కుట్రకు తెరలేపారు.

ఇందూటెక్‌కు భూములు- టక్కుటమార విద్యలతో జగన్​ కంపెనీలకు నిధులు! సీబీఐ చార్జిషీట్​పై 234 వాయిదాలు

కూకట్‌పల్లిలోని 50 ఎకరాల్లో రూ.393.69 కోట్లతో, గచ్చిబౌలిలోని 4.29 ఎకరాల్లో రూ.25.42 కోట్లతో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను ఎంబసీ రియల్టర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, యునిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, సోమా ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, అవినాష్‌ భోస్లేలతో కలిసి ఎంబసీ-యూనిటీ కన్సార్షియం పేరిట చేపడతామంటూ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వేర్వేరుగా చూస్తే ఇందులోని ఏ సంస్థకు అర్హతలు లేవు.

కానీ, బృందం ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అనుమతిచ్చారు. కూకట్‌పల్లి ప్రాజెక్టుకు ఎకరానికి రూ.1.50 కోట్లు, గచ్చిబౌలి ప్రాజెక్టుకు ఎకరానికి రూ.45 లక్షలు కోట్‌ చేసిన ఎంబసీ-యూనిటీ కన్సార్షియం బిడ్‌లను 2004 నవంబరు 1న హైపవర్‌ కమిటీ ఆమోదించింది. నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగానూ ఉన్న సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 2004 నవంబరు 15న అనుమతిచ్చారు.

కూకట్‌పల్లిలో ప్రాజెక్టు చేపట్టేందుకు సైబరాబాద్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గచ్చిబౌలి ప్రాజెక్టు కోసం వసంత ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఎస్పీవీలు ఏర్పాటు చేసినట్లు ఎంబసీ-యూనిటీ తెలిపింది. భూములు కేటాయించాక కన్సార్షియంలో మార్పులకు అనుమతి కోరింది.

ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ 51.25%, ఎంబసీ రియల్టర్స్‌ ప్రై.లి.కి 34.75%, అవినాష్‌ భోస్లేకు 14% వాటాలకు అనుమతివ్వాలని 2005 జనవరి 22న ఏపీహెచ్‌బీ(Andhra Pradesh Housing Board)కి లేఖ రాసింది. సోమా ఎంటర్‌ప్రైజెస్‌, యూనిటీ ఇన్‌ఫ్రాలు కన్సార్షియంలో లేకపోవడంపై ఏపీహెచ్‌బీ అభ్యంతరం తెలపడంతో రెండు ఎస్పీవీల్లోనూ 'ఎంబసీ'కి 20%, ఇందూకు 51%, 'యూనిటీ'కి ఒక శాతం, సోమాకు 14%, అవినాష్‌ భోస్లేకు 14% వాటాలు ఉంటాయని శ్యాంప్రసాద్‌రెడ్డి 2005 ఫిబ్రవరి 23న లేఖలు రాశారు.

8 వేల 844 ఎకరాలను గద్దల్లా తన్నుకుపోయిన జే గ్యాంగ్​ - లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌తో ఉద్యోగాలంటూ బురిడీ

వాటి ప్రాతిపదికన ఏపీహెచ్‌బీ(APHB) 2005 ఫిబ్రవరి 28న కూకట్‌పల్లి, గచ్చిబౌలి ప్రాజెక్టులకు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు చేసుకుంది. అయితే ఇక్కడే చిన్న మతలబు ఉంది. ఎస్పీవీలో ఉన్న షేర్లన్నీ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయన భార్య పేరిటే ఉన్నాయి. ప్రాజెక్టులను దక్కించుకోవడానికే మోసపూరితంగా వ్యవహరించారని సీబీఐ విచారణలో తేలింది.

గచ్చిబౌలి ప్రాజెక్ట్ దక్కించుకున్న వసంత ప్రాజెక్ట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2004 డిసెంబర్ 19న వసంత వెంకట కృష్ణప్రసాద్, ఆయన తల్లి హైమావతి స్థాపించారు. ఎంబసీ-యూనిటీ కన్సార్షియంలోని భాగస్వామ్య కంపెనీలకు డబ్బులు చెల్లించి కృష్ణప్రసాద్‌ అందులో చేరారు. తర్వాత వసంత ప్రాజెక్ట్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో 2004 డిసెంబరు 31న శ్యాంప్రసాద్‌రెడ్డి చేరారు.

వసంత ప్రాజెక్ట్స్‌ కన్సార్షియంలో ఇందూ, ఎంబసీ, యూనిటీ, అవినాష్‌భోస్లే, సోమా ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వామ్యులుగా ఉన్నాయని నమ్మించి శ్యాంప్రసాద్‌రెడ్డి 2005 ఫిబ్రవరి 28న ప్రభుత్వంతో గచ్చిబౌలి ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకున్నారు. అయితే వాస్తవానికి అప్పటికి వసంత ప్రాజెక్ట్స్​లో ఆ సంస్థలు ఏవీ లేవు. అది కేవలం వసంత కృష్ణప్రసాద్, ఆయన తల్లి హైమావతి ఆధీనంలో ఉందని సీబీఐ(CBI) విచారణలో తేలింది.

హైదరాబాద్ బండ్లగూడలోనూ 50 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు 2005 జూన్ 10న ఏపీ హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందూ- ఎంబసీతోపాటు మరో రెండు కన్సార్షియంలు బిడ్లు దాఖలు చేశాయి. చివరకు ఎంబసీకే పనులు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇందూకు 74శాతం, ఎంబసీకి 26 శాతం వాటాలుగా ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీ ఏర్పాటు చేసినట్లు హౌసింగ్ బోర్డుకు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

వాస్తవానికి ఈ ఎస్పీవీ కూడా పూర్తిగా శ్యాంప్రసాద్‌రెడ్డిదేనని సీబీఐ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు జగన్ మంత్రాంగం నడిపించారు. ప్రతిఫలంగా వైవీ సుబ్బారెడ్డికి గచ్చిబౌలి ప్రాజెక్టులో సగం వాటా దక్కిందని, జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏషియా సంస్థలో శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.20 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు సీబీఐ విచారణలో తేలింది.

Lepakshi Knowledge Hub: లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములకు మరో పెద్ద గండం.. రూ.5 కోట్ల బకాయికి 1600కోట్లు!

ఏపీఐఐసీ(Andhra Pradesh Industrial Infrastructure Corporation LTD)కి వసంత ప్రాజెక్ట్స్‌ రెండో విడత డెవలప్‌మెంట్‌ ఛార్జీలను చెల్లించే సమయంలో వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. 2005 మే17న కూకట్‌పల్లిలోని చిడ్కో ప్రాజెక్టుకు అదనంగా 15 ఎకరాలు కేటాయించాలని అప్పటి హౌసింగ్ బోర్డు వీసీ, ఎండీ మొహంతి సిఫార్సు చేశారు. దీనికి సీఎం కుర్చీలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆమోదించారు.

ఏపీఐఐసీ(APIIC)కి తెలియకుండానే ఇందూ ప్రాజెక్ట్సుకు చెందిన 51శాతం వాటాను సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్‌లకు కేటాయించి శ్యాంప్రసాద్‌రెడ్డి మోసానికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులోని విల్లాలను సాధారణ ప్రజలకు ఆఫర్‌ చేయాలి. కానీ వసంత కృష్ణప్రసాద్, సుబ్బారెడ్డి పలు విల్లాలను తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ఇష్టారాజ్యంగా అమ్మేశారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన ఎల్‌ఐజీ(Low Income Group)ల నిబంధనను సైతం పక్కనపెట్టి కేవలం హై ఎండ్‌ విల్లాలనే నిర్మించినా హౌసింగ్ బోర్డు పట్టించుకోలేదు.

క్రమంగా చిడ్కోలో అయిదు కంపెనీలకు బదులుగా మూడు, వసంత ప్రాజెక్ట్స్‌లో అయిదుకు బదులుగా ఒకే సంస్థ మిగిలిపోయాయి. ఆ తర్వాత చిడ్కో నుంచి ఎంబసీ రియల్టర్స్‌ ప్రై.లి. తప్పుకొంది. ఈ మొత్తం వ్యవహారంలో 'ఎంబసీ' యజమాని జితేంద్ర వీర్వాణి రూ.50.16 కోట్ల లబ్ధి పొందినట్లు సీబీఐ తేల్చింది. నంద్యాలలో 75 ఎకరాల్లో రూ.117.83 కోట్లతో గృహ నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణానికి 2005 జనవరి 17న హౌసింగ్ బోర్డు ప్రకటన ఇవ్వగా రెండున్నర లక్షలకు ఎకరం చొప్పున డెవలప్ చేసేందుకు ఇందూ సంస్థ మాత్రమే బిడ్‌ దాఖలు చేసింది.

ఇందూకు సాంకేతిక, ఆర్థిక సామర్థ్యం లేకున్నా, సింగిల్‌ బిడ్‌ దాఖలైన కారణంగా 2005 మే 17న హైపవర్‌ కమిటీ శ్యాంప్రసాద్‌రెడ్డితో ఒప్పందం చేసుకుంది. గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని సీబీఐ విచారణలో తేలింది. 2014 సెప్టెంబరు 9న ఛార్జిషీట్‌ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. ప్రధాన నిందితుడు A1 గా జగన్, A2 గా విజయసాయి రెడ్డితోపాటు ఎస్‌.ఎన్‌.మొహంతి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ ప్రాజెక్ట్స్‌ , వై.వి.సుబ్బారెడ్డి సహా 14 మందిని చేర్చింది.

అయితే ఈ కేసు విచారణ ఇప్పటివరకు 224 సార్లు వాయిదా పడింది. నిందితులంతా తమను కేసు నుంచి తొలగించాలని సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు(Discharge Petitions) దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ పూర్తికాగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇదే కేసులో రంగంలోకి దిగిన ఈడీ(Enforcement Directorate) జగన్, శ్యాంప్రసాద్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సహా 11 మందిపై 2021 మార్చి 22న సీబీఐ కోర్టులో ఛార్జిషీట్‌ వేసింది.

ఇందూ, జితేంద్ర వీర్వాణి, ఎంబసీ, వసంత ప్రాజెక్ట్స్‌లకు చెందిన రూ.117.74 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసు కూడా ఇప్పటి వరకు 70సార్లు వాయిదా పడింది. ఈ కేసులు నిరూపితమైతే నిందితులకు గరిష్ఠంగా యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఈడీ(ED) కేసులో రెండేళ్లకు మించి శిక్షపడితే ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష కాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు.

APIIC: దోచుకున్న తర్వాత మేల్కొన్న ఏపీఐఐసీ..

Last Updated : Feb 16, 2024, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details