ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

నేటితో ముగిసిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్టే గడువు - ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐసీఏఐ

ICAI Disciplinary Committee on MP Vijaya Sai Reddy: గౌరవప్రదమైన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వృత్తిలో ఉంటూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా విజయసాయిరెడ్డి వ్యహరించారని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఆయనపై ఐ.సీ.ఏ.ఐ క్రమశిక్షణ కమిటీ మూడుసార్లు వేర్వేరుగా విచారణ జరిపినా ఆయన తప్పు చేసినట్లే నిరూపితమైందని తెలిపింది.

ICAI_Disciplinary_Committee_on_MP_Vijaya_Sai_Reddy
ICAI_Disciplinary_Committee_on_MP_Vijaya_Sai_Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 6:51 AM IST

ICAI Disciplinary Committee on MP Vijaya Sai Reddy: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తమ క్రమశిక్షణ కమిటీ నిర్థరించందని ఐ.సీ.ఏ.ఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సీఎం జగన్‌, ఆయన గ్రూప్ సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. చార్టర్డ్ అకౌంటెంట్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ముడుపులను పెట్టుబడులుగా మళ్లించడంలో కీలకపాత్ర పోషించారని ఐ.సీ.ఏ.ఐ తెలిపింది.

ఈ మేరకు ఐసీఏఐ క్రమశిక్షణ డైరెక్టరేట్ మూడుసార్లు అధ్యయనం చేసిందని, ఇందులో ఆయన వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు అధికారులు ఏకాభిప్రాయంతో నివేదికలు అందజేశారని తెలిపింది. విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారించాల్సి ఉన్నందున గతేడాది నవంబర్ 3న విచారణను నిలిపిస్తూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ హైకోర్టును ఐ.సీ.ఏ.ఐ కోరింది. తెలంగాణ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది.

చార్టర్డ్‌ అకౌంటెంట్ వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై విచారణకు హాజరుకావాలంటూ గతేడాది అక్టోబర్ 23న ఐ.సీ.ఏ.ఐ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసి ఆయన స్టే పొందారు. దీనిపై ఐ.సీ.ఏ.ఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఐ.సీ.ఏ.ఐ సంస్థ చెన్నైలో ఉందని, విజయసాయిరెడ్డి కార్యాలయం సైతం అక్కడే ఉందని కౌంటర్‌లో పేర్కొంది.

ఎంపీ విజయసాయి రెడ్డి అవినీతి అక్రమాస్తులపై సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ

ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చెన్నై వేదికగానే కొనసాగాయి కాబట్టి విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని తెలిపింది. విజయసాయిరెడ్డి పై క్రమశిక్షణ చర్యలు ఛార్టర్డ్ అకౌంటెంట్స్ చట్ట నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపింది. తప్పుచేసినట్లు ఇంకా ధ్రువీకరించ లేదని, విచారణ ప్రారంభ దశలో ఉండగా కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది.

ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా ఉత్తర్వులు వచ్చినా అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించొచ్చని కౌంటర్‌లో పేర్కొంది. ఇదే వ్యవహారంలో 2015లోనూ విజయసాయిరెడ్డి ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐ.సీ.ఏ.ఐ క్రమశిక్షణ డైరెక్టరేట్ విచారణ చేపట్టి ప్రాథమిక అభిప్రాయాన్ని 2017, 2021, 2022లో క్రమశిక్షణ కమిటీకి అందజేసింది.

మూడుసార్లు 3 వేర్వేరు అధికారులు అభిప్రాయాలు ఇచ్చినా విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నివేదిక అందజేశారని ఐ.సీ.ఏ.ఐ సంస్థ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది. 2008లో కన్నన్‌తో విజయసాయిరెడ్డికి చెన్నైలో పరిచయం ఏర్పడింది. ఏపీలో సమస్యల్లేకుండా సిమెంట్ పరిశ్రమను నిర్వహించుకోవడానికి జగతిలో 5 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని సాయిరెడ్డి అడిగారు.

తేలుకుట్టిన దొంగలా దాక్కున్న విజయసాయిరెడ్డి - విచారణకు హాజరైతే బండారం బట్టబయలు : టీడీపీ

దీంతో కన్నన్ జయలక్ష్మి టెక్స్‌ టైల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి 5 కోట్లు రూపాయల పెట్టుబడి పెట్టారు. 2008 నవంబరులో మాధవ్ రామచంద్రకు సాయిరెడ్డి ఫోన్ చేసి జగతి పబ్లికేషన్స్ త్వరలో పబ్లిక్ ఇష్యూకు వెళ్తోందని, పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయని చెప్పారు. విజయసాయిరెడ్డి మాటలతో పాటు డెల్లాయిట్ నివేదికను విశ్వసించి ఆయన 19.66 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు.

అభియోగపత్రాన్ని పరిశీలిస్తే 2008-09లో పెట్టుబడులు పెట్టాలని సాయిరెడ్డి అడిగినట్లు సాక్షులు వెల్లడించారు. జగతి వ్యాపారం ప్రారంభించకుండానే 35 రెట్ల ప్రీమియం నిర్ణయించడం, డివిడెంట్, వడ్డీ వివరాల్లేకుండా మదింపు వేయడాన్ని ఆదాయపన్ను విభాగం తప్పుబట్టిందని, వీటన్నింటి ఆధారంగా జగన్‌తో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి చురుకైన పాత్ర పోషించారని ఐ.సీ.ఏ.ఐ పేర్కొంది.

విజయసాయిరెడ్డి 2007 జూన్ 21న జగతి సంస్థ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. అనంతరం జగతిని జగన్ చేజిక్కించున్నారు. ఆ తర్వాత కూడా కంపెనీతో, జగన్‌తో సన్నిహితంగా ఉంటూ విజయసాయిరెడ్డి పెట్టుబడులు రాబట్టినట్లు విచారణలో తేలింది. మదింపు నివేదికను తారుమారు చేయడంలో ఆయన పాత్ర ఉందని నిరూపితమైంది.

ఈ సమయంలో ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని, వృత్తిపరమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జగన్, ఆయన కంపెనీలకు దురుద్దేశపూరితంగా సహకరించారని, ఇది ఛార్టర్డ్ అకౌంటెంట్‌ చేయాల్సిన పనికాదని ఐ.సీ.ఏ.ఐ తెలిపింది. ఈ కారణాలతో విజయసాయిరెడ్డి ప్రాథమికంగా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేల్చిచెప్పింది.

ABOUT THE AUTHOR

...view details