Vangalapudi Anitha Counter to Jagan :రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై మాజీ సీఎం జగన్ దిల్లీ వెళ్తే, తానూ దిల్లీ వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సవాల్ చేశారు. బాబాయ్ హత్య కేసు నుంచి మొదలు పెట్టాలా లేక గత 5 ఏళ్లలో శాంతి భద్రతల పైనా, లేక గత నెల రోజుల తెలుగుదేశం పాలనపైనైనా జగన్‌తో దిల్లీలోనే చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు.
శాంతి భద్రతలపై శ్వేతపత్రం :అసెంబ్లీకి వస్తే తన భాగోతాలు బయటపడతాయని డైవర్షన్ పాలిటిక్స్‌ను పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎంచుకున్నాడని అనిత దుయ్యబట్టారు. ఈ నెల 24న అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపడుతోందన్న అనిత, ఆరోజు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని జగన్‌కు సవాల్ విసిరారు. దిల్లీ వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చిన హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రవర్తనకు చూసి సిగ్గుపడుతున్నారని విమర్శించారు.
రాజకీయ హత్యల్లో టీడీపీవారే బాధితులు : జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న జగన్‌పై ప్రభుత్వ పరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తే, ఇంకా నంగనాచి కబుర్లు చెప్పటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని వివరాలు వెల్లడించారు. క్రైమ్ నెంబర్లతో సహా తాను బయటపెడుతున్న అధికారిక సమాచారం తప్పని జగన్ చెప్పగలడా అని ప్రశ్నించారు.