ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్‌ - 9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైఎస్సార్సీపీ - Hello AP Bye Bye YCP - HELLO AP BYE BYE YCP

Hello AP Bye Bye YSRCP: ఆంధ్రప్రదేశ్​ ఓటర్లు హలో ఏపీ బైబై వైసీపీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ సృష్టించి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆధిక్యం సాధించింది. 9 ఉమ్మడి జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. కూటమి ప్రభంజనాన్ని తట్టుకోలేక కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు వెనుదిరిగారు. చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, లోకేశ్ భారీ విజయం సాధించారు. దీంతో #HelloAP_ByeByeYCP హ్యాష్ ట్యాగ్ ​​ట్రెండింగ్​లో కొనసాగుతోంది.

జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్‌ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి
జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్‌ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 11:40 AM IST

Updated : Jun 4, 2024, 4:44 PM IST

Hello AP Bye Bye YCP: శ్రీకాకుళం చీకొట్టింది. విజయనగరం విరగొట్టింది. విశాఖపట్నం విసిరేసింది. తూర్పుగోదావరి తరిమేసింది. పశ్చిమగోదావరి పాతరేసింది. కృష్ణా జిల్లా కూల్చేసింది. గుంటూరు కారం కొట్టింది. ఒంగోలు ఓడ గొట్టింది. నెల్లూరు నేల కూల్చింది. చిత్తూరు చీకొట్టింది. కడప కాల్చేసింది. కర్నూలు ఖతం చేసింది. చివరిగా అనంతపురం అంతం చేసింది. మొత్తంగా ఇదీ వైఎస్సార్సీపీపై ఆంధ్రప్రదేశ్​ ప్రజల అభిప్రాయం. అందుకే హలో ఏపీ బైబై వైసీపీ అంటూ ఆంధ్రా ఓటర్లు తీర్పు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆధిక్యం దిశగా కూటమి దూసుకెళ్తుండగా, కూటమి ప్రభంజనంలో ఫ్యాన్‌ కొట్టుకుపోయింది. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన కూటమి, జిల్లాలకు జిల్లాలే స్వీప్‌ చేస్తోంది. 9 ఉమ్మడి జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఖాతా తెరవలేకపోయింది. విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను కూటమి స్వీప్‌ చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. విజయం దిశగా చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, లోకేశ్ దూసుకెళ్తున్నారు.

ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగుతోంది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా నడుస్తోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి దూసుకెళ్తోంది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలోనూ సైకిల్​ పరుగులు పెడుతోంది. ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులు ఉన్నారు. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని అంబటి, గుడివాడ అమర్నాథ్‌తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది.

ఓటమి బాటలో మంత్రులు:కూటమి జోరుకు ఓటమి బాటలో మంత్రులు పయనిస్తున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఉష శ్రీచరణ్‌, పీడిక రాజన్నదొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, దాడిశెట్టి రాజా ఓటమి బాటలో ఉన్నారు. అదే విధంగా అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, పినిపె విశ్వరూప్‌, సీదిరి అప్పలరాజు సైతం ఓటమి వైపు పయనిస్తున్నారు.

టీడీపీ శ్రేణులు సంబరాలు: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​కు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు టపాసులు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నివాసం వద్ద తెలుగుదేశం శ్రేణులు టపాసులు కాల్చారు. రెండు చోట్లా సంబరాలు అంబరాన్ని అంటాయి. కొడాలినాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు టీవీలో చూసి నాని ముఖంపై తెలుగుదేశం శ్రేణులు చెప్పులతో కొట్టారు.

హలో ఏపీ బైబై వైసీపీ:కూటమి జోరుతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. సామాజిక మాధ్యమాలలోనూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. దీంతో #HelloAP_ByeByeYCP , #AllianceSweepingAP హ్యాష్ ట్యాగ్​లు ​​ట్రెండింగ్​లో కొనసాగుతున్నాయి.

ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result

ఓటమి దిశగా వైఎస్సార్సీపీ - మంత్రులూ ఇంటి బాటే - defeat of YsrCP ministers 2024 ap

Last Updated : Jun 4, 2024, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details