Amaravati outer ring road : అమరావతి ఔటర్ ప్రాజెక్టు సాకారమైతే ఆ ఓఆర్‌ఆర్ లోపలే కాదు వెలుపల కూడా భూములు బంగారం కానున్నాయి. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రం అవుతోంది. ఓఆర్‌ఆర్‌కు వెలుపలా కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం 217 చ.కి.మీ.ల పరిధికే పరిమితం చేయలేదు. అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలకు ఇది శ్రీకారం చుట్టడమే.
అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనాభా పెరిగి, ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి, దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఔటర్ రింగ్‌రోడ్డులు నిర్మించారు. అమరావతి ఓఆర్‌ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి, ఓఆర్‌ఆర్‌కు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఓఆర్‌ఆర్ ముఖ్యాంశాలివీ...
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో CRDAపరిధిలో 189 కి.మీ.ల పొడవున నిర్మాణం.
- 150 మీటర్ల వెడల్పుతో, రెండు వైపులా సర్వీస్ రోడ్లు, ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వే
- 2018 అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.17,761.49 కోట్లు.
- అవసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు.
- అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ(మోర్త్) అంగీకారం తెలిపింది. ఏడోదశ రింగ్‌రోడ్ల అభివృద్ధి కింద మంజూరుచేసింది.
- ‘అవుటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ’ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు.
- కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.
- విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కంచికచర్ల వద్ద ఓఆర్‌ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల పొత్తూరు వద్ద కోల్‌కతా-చెన్నై రహదారిలో కలుస్తుంది.
- అక్కడినుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్‌హెచ్-65లో... అక్కడినుంచి విజయవాడ-ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16ను కలుస్తుంది.
- ఓఆర్‌ఆర్‌లో భాగంగా రెండుచోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు
- అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణాజిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు, వీటితో పాటు ఓఆర్‌ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు
- ఓఆర్‌ఆర్‌లోపల మండలాలు: 40
- ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా వెళ్తుంది.
- ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది.
- ఓఆర్‌ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని జనాభా సుమారు 40 లక్షలు