Harish Rao about BRS Attack Cases in Telangana :ఖమ్మం జిల్లాలో పంటపొలాలు ఎండిపోతున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నా జిల్లాలో పొలాలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు జలాశయానికి 100 మీటర్ల దిగువన సెప్టెంబర్ 1న కాలువకు గండి పడిందని తెలిపారు. గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ధ్వజమెత్తారు. సాగర్ నిండుకుండలా ఉన్నా సాగర్ ఆయకట్టు రైతుల పంటలు ఎండుతున్నాయని, పోయిన ఏడాది వర్షాలు పడక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల పంటలు ఎండుతున్నాయని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోయిన ఏడాది ప్రకృతి కరవు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరవు తెచ్చిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పంటలు ఎండబెట్టడమే తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఖమ్మం ప్రజలకు ఇచ్చే బహుమానమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు చేతకాదని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలుస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వరదల్లో పంట నష్టపోయిన రైతులతో సమానంగా పంట ఎండిపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సాగర్ కాలువ గండి పూడ్చి రైతులకు నీళ్లు ఇవ్వాలని హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించడం పాపమా? యుద్ధప్రాతిపదికన గండి పూడ్చి మిగిలిన పంటలనైనా కాపాడండి. బీఆర్ఎస్ తరపున ఒక బృందం ఖమ్మం వెళ్లి రైతులకు భరోసా కల్పిస్తాం' - హరీశ్‌రావు, మాజీమంత్రి