ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'విలువలే నా ఆస్తి' - జగన్ వ్యాఖ్యలపై మరో మాజీ రియాక్షన్ - MOPIDEVI VENKATA RAMANA ON YS JAGAN

జగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ - విలువలు, విధేయత, విశ్వసనీయతే తాను సంపాదించిన ఆస్తి అని వ్యాఖ్య

Mopidevi Venkata Ramana
Mopidevi Venkata Ramana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 1:50 PM IST

Mopidevi Venkata Ramana on YS Jagan: తాను ప్రలోభాలకి, పదవీ కాంక్షలకి అవకాశవాదానికి, ఒత్తిళ్లకి లొంగిపోయేవాడిని కాదని, ఈ విషయం జగన్ అంతరాత్మకే తెలుసని మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఒక్కరితో కూడా మాట పడకుండా ఈ రోజుకీ రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు.

తాను ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగే వ్యక్తినో కాదో జగన్ అంతరాత్మకే తెలుసని ఆయన అన్నారు. అలా లొంగిపోయే వ్యక్తిని అయితే కేసుల్లో ముద్దాయిగా ఉండేవాడిని కాదని స్పష్టం చేశారు. భయపడటం అనేది తన రక్తంలోనే లేదని అన్నారు. తన జీవితం ప్రజాసేవ‌కే అంకితమని తెలిపారు. తన 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో తాను సంపాదించిన ఆస్తి విలువలు, విధేయత, విశ్వసనీయత అని మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.

పార్టీని వీడిన వారిపై జగన్ వ్యాఖ్యలు: కాగా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీకి ఒక్కొక్కరిగా వీడ్కోలు పలుకుతూనే ఉన్నారు. వారిలో రాజ్యసభ సభ్యులు సైతం ఉన్నారు. రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటంపై వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత చాలా ముఖ్యమని, ప్రలోభాలకు లొంగకూడదని, భయపడకుండా ఉండాలని అన్నారు. అలా కాకుండా భయపడుతూ వేరే పార్టీల్లోకి మారి వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు ఉండాలని, అటువంటప్పుడే అతడిని నాయకుడిగా ఎదుటివాళ్లు చూపిస్తారని, కాలర్ ఎగిరేసుకుని తిరగడానికి కూడా వీలుంటుంది అని జగన్ అన్నారు. పార్టీ నుంచి వెళ్లి పోయిన రాజ్యసభ సభ్యులు విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఒక ఎంపీని, ఎమ్మెల్యేను చూస్తే వీళ్లు లీడర్లు అనే క్రెడిబులిటీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు.

మోపిదేవి వెంకటరమణ రాజీనామా:కాగా ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య తన పదవులకు రాజీనామా చేశారు. అదే విధంగా తాజాగా ఆ పార్టీలో కీలకమైన విజయసాయి రెడ్డి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే విజయసాయి రెడ్డి స్పందించగా, తాజాగా మోపిదేవి సైతం స్పందించారు.

జగన్‌ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటు రిప్లై

ABOUT THE AUTHOR

...view details