CPS Employees Chalo Vijayawada: ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో సీపీఎస్ఈఏ చేపట్టిన చలో విజయవాడపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే విజయవాడలోని ధర్నాచౌక్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ధర్నాచౌక్ వైపు ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చలో విజయవాడకు అనుమతి లేదని సీపీఎస్ ఉద్యోగులు విజయవాడకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఉద్యోగులు ఎవరైనా విజయవాడ వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు వాహనాలను కూడా సిద్ధం చేశారు. పోలీసుల తీరుపై సీపీఎస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసంపై సీపీఎస్ ఉద్యోగులు మరోసారి రోడెక్కేందుకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామంటూ గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చి చేతులెత్తేశారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నాలుగున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం సీపీఎస్‌పై ఆలోచనలో పడింది.
సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతులు లేవు- వస్తే అరెస్టులే: డీసీపీ
సీపీఎస్ రద్దు అనేది సాధ్యం కాదని భావించి, ఉద్యోగులు, ఉపాధ్యాయల దృష్టి మళ్లీంచేందుకు సీపీఎస్ బదులు జీపీఎస్ అంటూ మరో గుదిబండను తెచ్చి సీపీఎస్ ఉద్యోగుల నెత్తిన రుద్దారు. ఇదేమని ఉద్యోగులు ప్రశ్నిస్తే సీపీఎస్ పై అప్పట్లో జగన్‌కు అవగాహన లేదని అందుకే హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్‌ను నిరసిస్తూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో నేడు సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.
పాత పెన్షన్ సాధనకు ఆదివారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోతమోగిస్తున్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. విజయవాడకు సీపీఎస్ ఉద్యోగులు వస్తారన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు ఇస్తున్నారు. పోలీసుల తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హామీలను అడిగితేనే అంక్షలా - సీపీఎస్ ఉద్యోగులకు పోలీసుల నోటీసులు
ఛలో విజయవాడ జరగకుండా పోలీసులు సీపీఎస్ ఉద్యోగుల ఇళ్లకు, వారు పనిచేసే ప్రదేశాలకూ వెళ్లి నేరుగా వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు. ఛలో విజయవాడకు పోలీసు శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అనుమతులు లేవని తెలిపారు. నోటీసులను కాదని విజయవాడ వెళ్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో ఇదే నిదంగా నోటీసులిచ్చి, ఆపై విచారణ పేరిట స్టేషన్లకు పిలిపించి ఉద్యోగులను రోజంతా స్టేషన్లలోనే ఉంచేశారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.
గతంలో మాదిరే నేడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులపై నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఛలో విజయవాడ నేపథ్యంలో పోలీసులు విజయవాడలోని ధర్నా చౌక్‌ను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఎవరు ధర్నాచౌక్‌కి రాకుండా బారీ గేట్లు అడ్డుగా పెట్టారు. ఎవరైనా ఉద్యోగులు వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు వాహనాలను కూడా సిద్దం చేశారు.