Condolences to Sitaram Yechury: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఏచూరి దేశ రాజకీయాల్లో గౌరవ స్థానం పొందారని గుర్తు చేశారు. పేద ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి అని కొనియాడారు. అట్టడుగువర్గాలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీతారామ్ ఏచూరి కోలుకొంటారని భావించానని పవన్ పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా వామపక్ష భావజాలంతో మొదలైన రాజకీయ ప్రస్థానంలో తన ప్రతి అడుగు పేద ప్రజలు, బాధితులు, కార్మికుల పక్షాన వేశారని గుర్తుచేశారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కుల కోసం బలంగా పోరాడుతూ అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని అందుకున్నారని కొనియాడారు. విదేశాంగ విధానంపై, ఆర్థికాంశాలపై, పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ వ్యాసాలు రాశారని చెప్పారు. సీతారాం ఏచూరి మరణం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంటానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని తెలిపారు. ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.