Police Respect to Borugadda Anilkumar in Station: పోలీస్ కస్టడీలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు చేస్తున్న రాచమర్యాదలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలు వీడియోలు వెలుగులోకి రాగా తాజాగా గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో జరిగిన రాచమర్యాదలకు సంబంధించిన మరో సీసీ టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇది ఆదివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. 3 నిమిషాల 58 సెకన్ల పాటు ఉన్న ఈ ఫుటేజ్‌లో బోరుగడ్డ '‘భయ్యా ఒక టీ'’ అని ఆర్డర్ ఇవ్వడం, కానిస్టేబుల్ కొన్ని సెకన్లలోనే టీ తీసుకొచ్చి ఇవ్వడం, మరో కానిస్టేబుల్ వచ్చి కాసేపు మాట్లాడటం ఈ వీడియోలో కనిపించింది.
అదే సమయంలో మరో సాధారణ నిందితుడిని స్టేషన్‌లో నేలమీదనే కింద కూర్చోబెట్టి ఉంచిన పోలీసులు రౌడీషీటర్ అనిల్‌కుమార్‌ను అదీ రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి మరీ రాచమర్యాదలు చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇది పైస్థాయి తెలియకుండానే జరిగి ఉంటుందా, కేవలం కానిస్టేబుళ్ల మీదే చర్యలు తీసుకుని అధికారులను వదిలేయడం ఎంతవరకు సమంజసం? గత నెల 27న పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ కూడా రౌడీషీటర్ అనిల్‌కుమార్‌ను సీఐ గదిలో కుర్చీలో కూర్చోబెట్టి విచారించారని సస్పెండైన సిబ్బందిలో ఒకరు వాపోయారు.
అయితే అనిల్ కుమార్‌కు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదల వ్యవహారంలో ఉన్నతాధికారులు మరో నలుగురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అరండల్ పేట్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావులను సస్పెన్షన్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇప్పటికే అరండల్ పేట సీఐను వీఆర్‌కు పంపించారు.