TDP Focus on MLC Posts : రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికల వేడి చల్లారడంతో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వైఎస్సార్సీపీలో ఇమడలేమంటూ ఇప్పటికే నలుగురు శాసనమండలి సభ్యులు రాజీనామా చేశారు. మరో 8 మంది అసంతృప్తులు ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు మార్చిలో మరో 5 ఖాళీలు ఏర్పడనుండగా మొత్తంగా 15 వరకు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పదవుల భర్తీపై కొందరు ముఖ్య నేతలను పిలిచి చర్చిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీంతో టీడీపీ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పొత్తుల్లో భాగంగా సీటు దక్కించుకోలేకపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వీరిలో పిఠాపురం నుంచి వర్మ, మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమతో పాటు వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో శాసనమండలిలో గట్టిగా పోరాడిన వారికి తిరిగి అవకాశం లభించనుంది. ఇందులో మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధావెంకన్న, అంగర రామ్మోహన్ పేర్లు ఉన్నాయి.
MLC Posts Race in TDP :ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, పీతల సుజాత ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన మద్దిపట్ల సూర్యప్రకాష్ ఈసారి అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చెంగల్రాయుడు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, నాగుల్ మీరా, మోపిదేవి వెంకట రమణారావు, విష్ణువర్థన్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, కలమట వెంకటరమణ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.